• HOME
  • భక్తి
  • నీలమాధవుని నెలవు.. శ్రీక్షేత్రం

   ఇతర వైష్ణవ క్షేత్రాల కంటే పూరీ క్షేత్రం ఎన్నోరకాలుగా విభిన్నమైనది. నాటి పురుషోత్తమపురమే ప్రస్తుతం ‘పూరీ’గా, శ్రీక్షేత్రంగా వ్యవహరింపబడుతోంది. ఇక్కడ స్వామి జగన్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. భక్తజన సమ్మోహనుడైన నల్లనయ్య ఈ క్షేత్రాన తన దేవేరులతో గాక అన్నగారైన బలరాముడు, ముద్దుల చెల్లి సుభద్రా దేవీ సమేతంగా దర్శనమిస్తాడు. పూరీ క్షేత్రాన్ని దర్శించటమంటే జీవన్ముక్తిని పొందటమేననీ, అందుకే దీని ముక్తిధామమనీ అంటారు. ఈ క్షేత్రం కొలువై ఉన్న నీల పర్వత ప్రస్తావన, దానిపై నీలమణి ధరించి కొలువైన నీలమాధవుని శబరులు సేవించిన వైనపు ప్రస్తావన స్కాంద పురాణంలో ఉంది. రథయాత్రలో భాగంగా భక్తులను తరింపజేసేందుకు ఎప్పటిలాగే ఈ ఏడాదీ స్వామి తరలి వస్తున్న వేళ ఆ స్వామి కోరి కొలువై ఉన్న పూరీ దివ్యధామ విశేషాలను తెలుసుకుందాం. 

స్థలపురాణం

మాళవ రాజు ఇంద్రద్యుమ్నుడు నీలమాధవునికి గుడి కట్టించాలనుకొని నీలాచలంపై స్వామి స్థానాన్ని గుర్తించే పనిని పురోహితుడైన 'విద్యావతి' కి అప్పగిస్తాడు. స్వామి జాడ కోసం స్థానిక శబర జాతి నాయకుడు 'విశ్వావను' సాయం పొందిన విద్యావతి ఆ నాయకుడి కూతురు లలితను పెళ్ళాడి నీలమాధవుడి స్థానాన్ని దర్శించి ఆ సంగతిని రాజుకు తెలియజేస్తాడు. మందీమార్బలంతో ఆనందంతో ఇంద్రద్యుమ్నుడు అక్కడికి తరలి వచ్చేసరికి నీలమాధవుడితో బాటు శబరుల గ్రామం కూడా అదృశ్యమవటంతో రాజు దుఃఖముతో ప్రాయోపవేశానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో 'అశ్వమేధ యాగంతో బాటు నృసింహ ప్రతిష్ట చేస్తే నీ కోరిక నెరవేరగలద'ని అశరీరవాణి చెప్పడంతో రాజు పూరీ క్షేత్రాన యాగం చేసి నరసింహస్వామి కోవెల నిర్మించాడు. 

రాజు అచంచల భక్తికి మెచ్చిన విష్ణువు అతనికి కలలో దర్శనమిచ్చి పూరీతీరాన సముద్రం నుంచి వచ్చే సుగంధ భరితమైన దారువు(పెద్ద కొయ్య)ను విగ్రహంగా మలచమని’’చెబుతాడు. అయితే ఆ దారువు లభించినా స్వామి రూపు తెలియని కారణంగా రాజు మళ్ళీ నిరాశపడతాడు. అప్పుడు విష్ణువు విశ్వకర్మతో వచ్చి దారువును నేడు మనం చూస్తున్న జగన్నాథుని రూపంలో చెక్కి అందులో బ్రహ్మపదార్థాన్ని పెట్టి అదృశ్యమవుతారు. కనురెప్పలు లేని పెద్ద, గుండ్రని కళ్ళతో దర్శనమిచ్చే జగన్నాథుని విగ్రహం కాళ్ళూ చేతులు లేకుండా కేవలం మొండెం వరకే ఉంటుంది. రెప్పపాటు కాలం కూడా భక్తులను చూడకుండా ఉండలేననే సందేశం ఈ రూపంలో వుంది. నాడు బ్రహ్మచేత నృసింహ మంత్రాలతో ఇక్కడి మూర్తులను ప్రతిష్ఠచేసినట్లు పురాణ కథనాలున్నాయి. ‘అనంత తత్త్వానికి ప్రతీక అయిన నలుపు రంగులో జగన్నాథుడు, శుద్ధ సత్వానికి ప్రతీకగా బలభద్రుడు తెల్లని రంగులో, సంపదకు సంకేతంగా పసుపు ఛాయలో సుభద్రాదేవి కనువిందు చేస్తారు.బలభద్రుడు ఋగ్వేదానికి, జగన్నాథుడు సామవేదానికి, సుభద్ర యజుర్వేదానికి, సుదర్శనుడు అధర్వణ వేదానికీ ప్రతీకలని చెబుతారు. 

ఆలయ విశేషాలు

పూరీ ఆలయం 4 లక్షల చదరపు అడుగుల పై చిలుకు వైశాల్యంలో విస్తరించి ఉంటుంది. ప్రధాన ఆలయ 4 ద్వారాలల్లో తూర్పు ద్వారాన్ని సింహ ద్వారమని, మిగిలిన 3 ద్వారాలను హాథీ(ఏనుగు)ద్వార, వ్యాఘ్ర(పులి)ద్వార, అశ్వ(గుర్రం)ద్వార అంటారు. ఈ పాంగణంలో ప్రధాన ఆలయంతో బాటు సుమారు 120 ఉపాలయాలున్నాయి. ప్రధాన ఆలయంలో 'నీలచక్ర'గా పిలవబడే 8 ఆకులుగల అష్టదాతు శ్రీచక్రం దర్శనమిస్తుంది. గర్భాలయం కంటే ఎత్తైన దిమ్మె మీద ప్రతిష్టించిన ధ్వజస్తంభం భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఉత్కళ నిర్మాణ రీతిలో మలచిన ఇక్కడి ఆలయ శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుంది.

క్షేత్ర ప్రత్యేకతలు

  • ఇక్కడ మూలవిరాట్టు, ఉత్సవ విగ్రహాలు అంటూ విడిగా ఉండవు. కొయ్యతో ఉండే మూర్తులే అన్ని పూజలూ అందుకొంటాయి.
  • అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న పూరీ క్షేత్రాన అమ్మవారు విమలాదేవి గా పూజలందుకుంటోంది.
  • పూరీ ఆలయంపై ఉండే పెద్ద సుదర్శన చక్రాన్ని నగరపు ఏ మూల నిలబడి చూసినా మనవైపే తిరిగి కనిపిస్తుంది.
  • ఆలయ గర్భాలయ గోపురంపై రోజులో పలుమార్లు వేర్వేరు రంగుల జెండాలను ఎగురవేయడం మరో విశేషం.
  • మూలమూర్తులను మార్చే సమయంలో పాత జగన్నాథుడి బొడ్డులో ఉండే కమలాన్నితీసి కొత్త మూర్తి నాభికి అమర్చుతారు.
  • ఆదిశంకర, రామానుజ, నింబర్కాచార్య, శ్రీపాద వల్లభాచార్య, నానక్, కబీర్, జయదేవ, తులసీదాస్ వంటి ఎందరో మహాపురుషులు శ్రీక్షేత్రాన్ని దర్శించి తరించారు.
  • వైష్ణవ, శైవ, శక్తి, నృసింహ క్షేత్రమే గాక జైన క్షేత్రంగానూ పూరీ గుర్తింపు పొందింది.
  • ఈ ఆలయంలో చేసే ప్రసాదంలో చుక్క కూడా నూనె వాడరు. కట్టెల పొయ్యిపై మట్టికుండలను ఒకదానిపై ఒకటి పెట్టి వండే ఈ ప్రసాద తయారీని ప్రధాన ఆలయ తలుపులపై విగ్రహ రూపాన ఉన్న మహాలక్ష్మి పర్యవేక్షిస్తుందనీ, అందుకే అంతటి అద్భుతమైన రుచి వస్తుందని చెబుతారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE