• HOME
  • భక్తి
  • మహిమాన్విత క్షేత్రం.. మంత్రాలయం

   దక్షిణ భారత దేశంలో ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాల్లో మంత్రాలయం ముఖ్యమైనది. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలువైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఉంది. కర్ణాటక సరిహద్దులో, తుంగభద్ర తీరాన గల ఈ క్షేత్రంలోనే కృతయుగాన ప్రహ్లాదుడు యజ్ఞం చేసారనీ, శ్రీ రాఘవేంద్ర స్వామిని సాక్షాత్తూ ప్రహ్లాద అవతారమనీ భక్తులు విశ్వసిస్తారు. గురు రాఘవేంద్రులు నెలకొల్పిన ఇక్కడి మఠాన్నిశ్రీమఠం, ప్రీతికా సన్నిధి అనీ అంటారు. గురు రాఘవేంద్రులు భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షం గా కాచి కాపాడుతున్న ఈ దివ్యధామ విశేషాలు తెలుసుకుందాం. 

రాఘవేంద్రుల జీవన విశేషాలు

గురు రాఘవేంద్రుల జన్మనామం వేంకట నాథుడు. విజయనగర సామ్రాజ్యపు పండిత కుటుంబానికి చెందిన తిమ్మన్న భట్టు, గోపికాంబ దంపతులకు మన్మధనామ సంవత్సరం పాల్గుణశుద్ద సప్తమి గురువారం తమిళనాడులోని భువనగిరి గ్రామంలో రెండవ సంతానం గా ఆయన జన్మించారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతో బాల్యంలోనే వ్యాకరణ, తర్క, నిరుక్త, ఛంద, వేదాంతాలను ఔపాసన పట్టారు. సంగీతాన్నీ అభ్యసించి పలు కన్నడ కృతులను రచించి, సంగీతాన్ని సమకూర్చి, గానం చేశారు. బాల్యంలోనే సరస్వతితో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఉన్నత విధ్య కోసం కుంభకోణం చేరి శ్రీ సుదీంద్రతీర్ధుల వద్ద విద్యను అభ్యసించారు. అక్కడే శ్రీ మాన్ న్యాయసుధ, పరిమళ అనే గ్రంధాలను రచించటమే గాక మహభాష్య వెంకటనాధచార్య, పరిమళచార్య అనే బిరుదులను పొందారు. అప్పుడే తంజావూరులో యజ్ఞ నారాయణ దీక్షితులతో వాదంలో గెలిచి భట్టాచార్య బిరుదునూ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ద్వైత మధ్వ మహాపీఠానికి అస్ధాన విద్వాంసులుగా నియమితులయ్యారు. ఆ సమయంలోనే వేంకట నాథుడికి గురువైన సుధీంద్రతీర్ధస్వామి మధ్వ పీఠ సంప్రదాయం ప్రకారం సన్యాసదీక్ష నిచ్చి ' రాఘవేంద్రతీర్ధులు' అని నామకరణము చేశారు. తరువాతి రోజుల్లో పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి గురు రాఘవేంద్రులుగా ప్రసిద్ధులయ్యారు. నిరంతరం శ్రీమూల రాముని, పంచముఖ ఆంజనేయులను ఆరాధించారు. ఈ క్రమంలో పంచముఖిలో తపమాచరించి హనుమ దర్శనాన్ని పొందారు. 

గురువుగా మొండి రోగాలను నయం చేయటం, మృతులను బ్రతికించడం, అక్షరం తెలియని వారిని పండితులను చేయటం వంటి ఎన్నో మహిమలు చూపారు. ఆయన కీర్తిని ఓర్వలేని నాటి ఆదోని పాలకుడైన మసూద్ ఖాన్ మాంసపు తినుబండారాలను పంపగా రాఘవేంద్రులు అందరూ చూస్తుండగానే వాటిని ఫలాలుగా మార్చి అతనిలో గొప్ప పరివర్తన తెచ్చారు. ఆ సమయంలో ఆయన సమర్పించిన సువిశాల, సస్యశ్యామలమైన జాగీరుని తిరస్కరించి తుంగభద్రా నది ఒడ్డున గల మంత్రాలయాన్ని మాత్రం స్వీకరించి అక్కడ మఠాన్ని స్థాపించారు. శ్రీ రాఘవేంద్రులు కీ.శ.1671 విరోధినామ సంవత్సరం శ్రావణ బహుళవిధియ గురువారం ఉదయం మంత్రాలయం బృందవనంలో సజీవ సమాధి చెందారు. నాటి నుంచి నేటి వరకు స్వామి ఆ బృందావనం నుంచే భక్తులను కాపాడుతున్నారు. 

దర్శన క్రమం

మంత్రాలయానికి వచ్చే భక్తులు తుంగభద్రలో స్నానం ఆచరించి ముందుగా మంత్రాలయ గ్రామ దేవత మంచాలమ్మను దర్శిస్తారు. పార్వతి దేవి అవతారం గా భావించే ఈ తల్లిని రాఘవేంద్ర స్వామి వారు రోజూ పూజించే వారని చెబుతారు. తర్వాత గురు రాఘవేంద్రుల బృందావనాన్ని దర్శించి స్వామి ఆశీస్సులు పొందుతారు. మరెక్కడా లేనివిధంగా ఈ బృందావనం మీద స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4. నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. బృందావన దర్శనం తర్వాత భక్తులు మఠంలోని లక్ష్మివెంకటేశ్వర ఆలయాన్ని దర్శిస్తారు. ఇక్కడి మూలవరులను సాక్షాత్తూ శ్రీ రాఘవేంద్రులే ప్రతిష్టించినట్లు చెబుతారు. తర్వాత భక్తులు ఇక్కడి పంచ పంచ బృందావనాన్ని దర్శించి అక్కడ జీవ సమాధి పొందిన శ్రీ సుజనేంద్ర తీర్ధ, శ్రీ శుబోధేంద్ర తీర్ధ, శ్రీ సుప్రజనేంద్ర తీర్ధ, శ్రీ సుజనానేంద్ర తీర్ధ మరియు శ్రీ శుక్రుతీంద్ర దీర్ధల ఆశీస్సులు పొందుతారు. తర్వాత రాఘవేంద్ర స్వామి మఠం సముదాయం లోని పంచముఖ ఆంజనేయ ఆలయాన్ని దర్శించుకొంటారు. అందమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపై ఈ ఆలయం ఉంది. మఠ సముదాయం లోని వేద పాఠశాల, గోశాలను కూడా భక్తులు దర్శిస్తారు.

రవాణా

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుంచి మంత్రాలయానికి పలు బస్సు సర్వీసులున్నాయి. యాత్రికుల బసకు మఠం వారి గదులతో బాటు పలు ఇతర వసతి గృహాలు ఉన్నాయి. రైలు ప్రయాణీకులు ముంబై- మద్రాస్, డిల్లీ-బెంగుళూరు, హైదరాబాదు-తిరుపతి వెళ్ళే రైలు మార్గంలో “మంత్రాలయం రోడ్డు” రైల్వే స్టేషన్ లో దిగి అక్కడికి 16 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రాన్ని బస్సులు, ఆటోల్లో చేరుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE