• HOME
  • భక్తి
  • హజ్రత్‌ హుస్సేన్‌ బలిదానమే.. మొహర్రం 

    ధర్మస్థాపన కోసం మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌, ఆయన అనుచరులు చేసిన ప్రాణత్యాగానికి ప్రతీకగా షియా ముస్లింలు జరుపుకొనే సంతాప దినాలకే  మొహర్రం అని పేరు. మనదేశంలో దీన్ని కులమతాలకు అతీతంగా దీన్ని జరుపుకొంటారు.  ధర్మపోరాటంలో ప్రాణత్యాగానికి వెరవరాదనీ, ఎట్టి పరిస్థితిలోనూ నమ్మిన మార్గం నుంచి పక్కకు జరగరాదనేదే మొహర్రం సందేశం.

ఇదీ నేపథ్యం

మహమ్మద్‌ ప్రవక్త కుమార్తె ఫాతిమా. ఆమె కుమారులు హసన్‌, హుస్సేన్‌. క్రీ.శ 680లో ఖలీఫా మరణానంతరం మదీన సింహాసనపు వారసత్వం కోసం పోరాటం మొదలవుతుంది. అక్కడి రాజు తన వారసులను గద్దెనెక్కించే యత్నం చేయగా హసన్‌, హుస్సేన్‌లు దీన్ని ప్రశ్నిస్తారు. ఈ చర్చ చివరికి యుద్దానికి దారి తీసింది. ఈ క్రమంలోనే యుద్దానికి ముందే హాసన్‌ విషప్రయోగంతో హత్యకు గురవుతాడు. తర్వాత హుసేన్‌ తన కుటుంబ సభ్యులు, పరివారం మొత్తం 72 మందితో ఒక ప్రయాణంలో ఉండగా ఇరాక్‌లోని కర్బలా మైదానంలో  ప్రత్యర్థులు సైన్యంతో దాడి చేస్తారు. హుస్సేన్ బృందానికి మంచినీళ్లు కూడా పుట్టనీయక ఇబ్బందిపెడతారు. ఈ 10 రోజుల యుద్ధంలో గాయాల పాలైన హుస్సేన్‌, ఆయన అనుచరులు, ఆ బృందంలోని 80 ఏళ్ళ వృద్ధులు, పసిపిల్లలు దప్పికతో అలమటించి ప్రాణాలు కోల్పోతారు. ఆనాటి వారి త్యాగాన్ని షియా వర్గీయులు మొహర్రం పేరిట జరుపుకొంటారు.

తెలంగాణాలో పీర్లపండుగ

తైమూర్‌ పాలనా కాలంలో ఇక్కడి షియా సైనికులు ఏటా మొహర్రం కోసం ఇరాక్‌ వెళ్లేవారు. వారి ఇక్కట్లను గమనించిన రాజు నాటినుంచి ఇక్కడే మొహర్రం జరుపుకొనే ఏర్పాట్లు చేసాడట. అలా మనదేశంలో మొహర్రం మొదలవగా.. తెలంగాణాలో తొలిసారి 1587లో కుతుబ్‌షాహి రాజుల కాలంలో మౌలాలి గుట్ట మీద పీర్లను నిలిపినట్లు చరిత్ర చెబుతోంది. తెలంగాణలో మొహర్రం ను పీర్ల పండుగ అంటారు. ఈ సందర్భంగా మొహర్రం సందర్బంగా గ్రామాల్లో, పట్టణాల్లో అషుర్‌ ఖానాల్లో పీర్లను ప్రతిష్టిస్తారు. అషుర్‌ ఖానాలు లేని చోట్ల తాత్కాలికంగా పందిళ్లు వేసి పీర్లను నిలుపుతారు. పీర్లకు దట్టీలు కట్టి, కుడుకలు, గాజు, పువ్వుతో సంప్రదాయబద్ధంగా అంకరిస్తారు. 10 రోజుల పాటు ముస్లింలతోపాటు హిందువులు సైతం భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహిస్తారు. పీర్లను ప్రతిష్టించిన అషుర్‌ ఖానా ముందు అగ్ని గుండాలు ఏర్పాటు చేసి దుఃఖంతో చుట్టూరా తిరుగుతూ పాటలు పాడతారు.  సంతాప దినాలు ముగియగానే పీర్లను గ్రామంలోని వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. మొహర్రం సందర్భంగా హైద్రాబాద్‌లో షియా ముస్లింలు  సంతాప సూచకంగా రక్తం చిందిస్తారు.

విశేషాలు

ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన హుసేన్‌ బృందానికి మోక్షం కలిగేందుకు ముస్లింలు మొహర్రం మాసంలో 9, 10వ రోజు ఉపవాస దీక్షలు చేపడతారు. మొహర్రం శోకమాసం గనుక ముస్లింలు ఈ నెలలో శుభకార్యాలు చేయటం, కొత్త దుస్తులు, వస్తువులు వంటివి కొనుగోలు చేయటం చేయరు.  నాడు కర్బలా మైదానంలో దప్పికతో అల్లాడిన అమరుల వ్యధను గుర్తుంచుకొని మొహర్రం రోజు షర్భత్‌, అన్నదానం  వంటివి చేస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE