మానవ జీవితం మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. కర్మ ఫలాన్ని బట్టి ప్రస్తుత జన్మ గ్రహస్థితులు ఆధారపడి ఉంటాయి. నవగ్రహాలలో 8వ గ్రహమైన రాహువు ఎంతో ప్రభావశీలత కలిగినవాడు. గ్రహాలకు అధిపతి, ప్రాణశక్తి కారకుడు అయిన సూర్యుడిని సైతం నిస్తేజునిగా చేయగల సామర్ధ్యం రాహువు సొంతం. ముఖ్యంగా జాతకప్రకారం రాహు మహర్దశ నడుస్తున్న వారు ఈ సమయంలో తగిన నివారణోపాయాలు పాటించటం అవసరం. దీనివల్ల రాహువు చూపే ప్రతికూల ప్రభావాల నుంచి బయటపడవచ్చు.

జన్మ విశేషాలు

రాహువు తండ్రి కశ్యపుడు, తల్లి దక్ష పుత్రిక అయిన సింహిక. భార్య కరాళ. రాహువు ఎత్తైన, నల్లని శరీరం, 4 భుజాలతో, కత్తి, త్రిశూలము, కవచం ధరించి సింహాన్ని అధిరోహించి ఉంటాడు. క్షీరసాగర మధన సమయంలో దేవతల వరుసలో కూర్చొని మోహినీ అవతారంలో ఉన్న విష్ణువు చేతి మీదుగా అమృతపానం చేస్తుండగా, సూర్య, చంద్రులు విష్ణువుకు సైగ ద్వారా సూచిస్తారు. దీంతో తాగిన అమృతం గొంతు దిగేలోపే విష్ణువు రాహువు తలను ఖండించగా, అతడు సర్పరూపాన్ని పొందుతాడు. ఆ తర్వాత విష్ణువు అనుగ్రహంతో గ్రహ మండలంలో స్థానం పొంది, తనకు అమృతాన్ని దక్కనివ్వని సూర్యచంద్రులను గ్రహణ రూపంలో పట్టి విడుస్తుంటాడని పురాణ కథనం.

స్వభావం, ప్రభావం

రాహువు స్త్రీ గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. రాహువు కొత్త అలవాట్లు, పరిచయాలు, అనుభూతులు కలిగిస్తాడు. నూతన ఆవిష్కరణలకు ప్రేరణ రాహువే. ఉన్నది లేనట్టు చూపుతాడు. అబద్ధాలు పలికిస్తాడు. అల్లకల్లోలాలు సృష్టిస్తాడు . శని వలే రాహువు కర్మ గ్రహం. పూర్వ జన్మఫలాన్ని అనుభవింపజేస్తాడు. అడ్డ దారిన అందలం ఎక్కే యత్నాలకి సహకరిస్తాడు. రాహుమహాదశలో కుటుంబ కలహాలు, దుర్బోధలకు లోనవుట, సంతానం తప్పిపోవుట, నిర్మాణ పనుల్లో నష్టాలు , విష జంతువుల ముప్పు, ప్రమాదకరమైన వాయువుల బారినపడుట, ఆత్మ న్యూన్యతకు లోనగుట వంటి ఘటనలు, ప్రభావాలు కనిపిస్తాయి.

రాహు మహర్దశ

రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభమవుతుంది. రాహు దశాకాలం 18 ఏళ్ళు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితిని, వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. రాహు మహాదశలో కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రాహు దశ లేదా అంతర్దశ జరుగుతున్నపుడు తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మలలో ఒకరికి ఆయువు తీరుతుంది. తప్పక అపర కర్మలు చేయాల్సివస్తుంది. విదేశీ భాషలల్లో ప్రావీణ్యం, విదేశీ యాత్ర అనుభవం, విదేశీ వస్తువుల కొనుగోలు, విదేశీ రోగాలకు రాహువు ప్రభావమే కారణం. ఈ దశాకాలంలో దుష్ట స్నేహాలు, వ్యసనాలపాలవటం, రాజ్యాధికారం పొందటం లేదా కోల్పోవటం, వర్ణాంతర వివాహాలు, నీచజాతి స్త్రీ సాంగత్యానికి పాల్పడటం, సంకుచిత ఆలోచనల వైపు మనిషి ఆకర్షితుడవుతాడు. పీడ కలలు, భయందోళనలు కలుగుతాయి.

రాహు గ్రహ శాంతి

రాహువుకు అధిదేవత దుర్గాదేవి. దుర్గా సప్తాసతి పారాయణ, మంత్రం జపంతో రాహువు ప్రసన్నుడవుతాడు. రోజూ రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మడిప్ప దీపం పెట్టటం వల్ల రాహువు అనుకూలిస్తాడు. వనదుర్గ దేవి ఆరాధన, గోపూజతో కూడా రాహువు అనుగ్రహిస్తాడు. ఏదైనా శనివారం మొదలుపెట్టి 18 రోజుల పాటు రోజూ పారే నీటిలో ఒక కొబ్బరికాయను వదిలిపెట్టడం లేదా నిద్రలేవగానే నెమలి పింఛాన్ని చూడటం వల్ల రాహువు అనుగ్రహం కలుగుతుంది. నల్ల దుస్తులు ధరించటం, మినపప్పు దానం, వేపనూనెతో చేసే దీపారాధన వల్ల రాహు దోషం తొలగిపోతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE