పరమాత్మను చేరేందుకు సాయపడే సులువైన మార్గాల్లో జపం ముఖ్యమైనది. యోగసాధనలోనూ జపం ఒక ముఖ్యాంశంగా ఉంది. జప శబ్దంలోని ‘జ' అనే అక్షరం జన్మవిఛ్చేదనానికి, ‘ప' అనే అక్షరం పాపనాశనాన్ని సూచిస్తుంది. యోగ సాధనలో జపం ఒక ముఖ్యాంశం. మనసు భగవంతుని మీదే నిలిపి ఎంపిక చేసుకొన్న నామాన్ని, మంత్రాన్ని లేదా శ్లోకాన్ని పదేపదే మననం చేయటమే జపం.'యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే' అని భగవద్గీతలో సాక్షాత్తూ కృష్ణ పరమాత్మ చెప్పిన సంగతి తెలిసిందే. సకల యజ్ఞాలలో 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపానికి కాలనియమం గానీ, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండం చెబుతోంది. జపానికి అందరూ అర్హులేనని అగస్త్యసంహిత పేర్కొంటోంది. జపం మనోభీష్టం నెరవేరేందుకు, ముక్తి సాధనకే గాక మానసిక ప్రశాంతతకు కూడా దోహదం చేస్తుంది. 

రకాలు.. ఫలితాలు

సాధారణంగా జపం 3 రకాలు. మొదటిది వాచికం. ఆంటే.. మంత్రబీజాక్షరాలను చుట్టూ ఉన్నవారికీ వినిపించేలా పలకటం. రెండవది ఉపాంశువు. ఆంటే.. అత్యంత సమీపంలో ఉన్నవారికే వినిపించేలా జపం చేయడం అన్నమాట. మూడవది.. మానసికం. ఆంటే.. మనస్సులోనే మంత్రాన్ని జపించడం. వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రెట్లు ఫలితాన్ని, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. జపానికి ముందు లేదా తరువాత విధిగా ఇష్ట దేవతా పూజ చేయాలి. పూజ లేని జపం నిరుపయోగమే. జప సమయంలో స్పష్టమైన ఉచ్చారణ, తగిన వేగంతో మంత్రాన్ని ఉచ్ఛరించాలి. జపంలో బీజాక్షరాలు లోపించకూడదు. 

నియమాలు

 • తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని జపం చేయటం మంచిది. జపానికి ముందు జపమాలను నీటిలో, పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఆ మాలతో ఏ మంత్రాన్ని జపిస్తారో అదే మంత్రంతో ఆ జపమాలను పూజించాలి. అనంతరం జపమాలకు ధూపం వేస్తూ ' త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే' అనే శ్లోకం చదవాలి.
 • తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల ఇలా.. ఒక్కో జపమాల ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. జపమాలలో 108, 54, 27 ఇలా వేర్వేరుగా పూసలుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది.
 • మాలలో ఒక పెద్దపూసను మేరువు అంటారు. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. మేరువు నుంచి మొదలుపెట్టి తిరిగి మేరువు వరకు తిప్పితే ఒక పర్యాయం పూర్తయినట్లు. ఆ తర్వాత దీనికి వ్యతిరేక దిశలో మాలను తిప్పాలి. ఇలా మార్చి మార్చి చేయాలి.
 • జప సమయంలో కనిష్ట, ఉంగరం వేలు, మధ్య వేళ్ళను ఆనించి బొటన వేలితో జపమాలను తిప్పాలి. చూపుడు వేలును వేరుగా ఉంచటం మరువొద్దు.
 • అనంతరం జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి.
 • పద్మాసనంలో కుడిచేతితో జపమాల పట్టుకొని దాన్ని ఇతరులు చూడకుండా గుడ్డ సంచి ( దీన్నే గౌముఖి అంటారు) లో పెట్టి జపం చేయాలి. గౌముఖి లేకపోతే శుభ్రమైన వస్తంతో కుడిచేతిని కప్పి ఉంచాలి.
 • చూపుడువేలుతో జపమాలను తాకటం, ఎడమచేతితో జపమాలను ముట్టుకోవటం, జపమాలను అటూ ఇటూ ఊపటం, చేతికి చుట్టుకోవటం, మెడలో వేసుకోవటం లేదా తలమీద పెట్టుకోవటం నిషేధం. జప సమయంలో తలమీద చేతిని గాని, వస్త్రాన్ని గాని వేసుకోరాదు.
 • పగిలిన, విరిగిన పూసలున్న జపమాలను వాడరాదు. జపం చేసేటప్పుడు మాల నుంచి శబ్దం రాకూడదు.
 • జప సమయంలో మాల తెగినా లేదా చేతినుంచి జారి పడితే ఆ సాధన లేక ఉపాసన పరిపూర్ణం కాదు.
 • జప సమయంలో అటూ ఇటూ కదలటం, కునుకు తీయటం, మాట్లాడటం పనికిరావు. మధ్యలో మాట్లాడాల్సివస్తే భగవంతుణ్ణి స్మరించుకుని జపాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. జపానంతరం మాలను పరిశుభ్రమైన చోట భద్రపరచుకోవాలి.
 • ఉదయం జపం చేసేవారు చేతి వేళ్ళు పైకి ఉండేట్లుగా పెట్టి జపమాలను గుండెకు దగ్గరగా పెట్టి జపించాలి. సాయంకాలం జపించేవారు కుడిమోకాలు నిలబెట్టి, దానిమీద కుడిచేతిని కిందకి తిప్పి ఉంచి మాల ముక్కుకు సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మధ్యాహ్న వేళ చేతివేళ్లు పైకి తిప్పి మాలను బొడ్డుకు సమీపంలో ఉంచి జపించాలి.
 • ఇంట్లో ఎంత జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. ఇంట్లో కంటే నదీ తీరాన చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దీనికి 100 రెట్లు ఫలితం గోశాలలో జపానికి, అంతకు మించిన ఫలం యాగశాలలో చేసే జపానికి సిద్ధిస్తుంది. ఇంటికంటే పుణ్య క్షేత్రం, దైవ సన్నిధిలో చేసే జపం పది వేల రెట్లు ఫలితాన్నిస్తుంది. శివాలయం లేదా శివ సన్నిధిలో చేసే జపం మహోన్నత ఫలితాన్ని ఇస్తుంది.
 • వెదురు కర్రల మీద జపం చేస్తే దరిద్రం, రాతి మీద కూర్చొని చేస్తే రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద కీర్తి తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా మారటం జరుగుతుంది. కృష్ణాజినం(జింక చర్మం) మీద చేసే జపం జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. పులి చర్మంపై కూర్చొని చేసే జపం మోక్షాన్ని ఇస్తుంది. అయితే.. గృహస్థులందు దర్భాసనం మీద కూర్చొని జపం చేయొచ్చు.
 • జపం ముగిశాక ఓంకారాన్ని ఉచ్చరించాలి.
 • జపమాలలోని దారం పాతదైపోతే, మళ్ళీ కొత్తదారంతో గుచ్చుకుని 100 సార్లు జపం చేయాలి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE