• HOME
  • భక్తి
  • మహాలక్ష్మి అనుగ్రహాన్నిచ్చే మార్గశిర వ్రతం

  భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ ఒక ప్రత్యేకత, పవిత్రతా ఉన్నాయి. అందులో పర్వదినాల సమాహారమైన మార్గశిర మాసపు స్థానం ఒకింత ప్రత్యేకమైనది. ఈ మాసాన్ని 'మార్గశీర్షం' అనీ అంటారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది గనుక దానికాపేరు. ఈ మాసం స్వయంగా నారాయణ స్వరూపమని చెబుతారు. ఇక.. విష్ణు స్వరూపమైన ఈ మాసం ఆయన దేవేరి మహాలక్ష్మికీ మక్కువైనదే! ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే 5 గురువారాలు మార్గశిర వ్రతం చేసిన వారికి మహాలక్ష్మి కోరిన వరాలను ప్రసాదిస్తుంది. ఒకవేళ ఈ నెలలో 4 గురువారాలు మాత్రమే ఉంటే పుష్యమాసపు మొదటి గురువారం నాడు కూడా ఈ వ్రతం చేసుకోవాలి.  వ్రతం విశేషాలు..

వ్రతవిధానం

గురువారం రోజు సూర్యోదయానికి మునుపే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి ముంగిట ముగ్గు వేసుకోవాలి. పూజా స్థానంలో పూలతో, బియ్యప్పిండితో ముగ్గు వేసి లక్ష్మీ ప్రతిమను స్థాపించి ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత మహాలక్ష్మికి షోడశోపచార (ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూర నీరాజనం) పూజ యథాశక్తి చేయాలి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం గనుక పూజలో అవి ఉండేలా చూడాలి. అనంతరం అమ్మవారి స్తోత్రాలు చదువుకొని చివరలో నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత వ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి. చివరగా దోష నివారణకు క్షమాప్రార్థన చేయాలి. తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా భావించి ఈ రోజు పులగం నివేదన చేయాలి. రెండవవారం క్షీరాన్నం (పరమాన్నం), మూడోవారం అట్లు, నాలుగోవారం గారెలు, అప్పాలు, చివరివారం పూర్ణం బూరెలను నివేదించాలి. మిగిలిన గురువారాలు చేయలేకపోయినా చివరి గురువారం ఐదుగురు ముత్తయిదువులకు స్వయంగా వండి వడ్డించి తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. 

నియమపాలన ముఖ్యం

ఈ వ్రతం చేసేవారు గురువారం రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో, తగు నియమాలను పాటించాలి. ఈ రోజు తలకు నూనె రాయడం, దువ్వటం, చిక్కు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య వేళ నిదురపోకూడదు. అబద్దం ఆడరాదు. ఈ నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి మహాలక్ష్మి సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE