• HOME
  • భక్తి
  • మోక్షసిద్దినిచ్చే కర్ణాటక  సప్త క్షేత్రాలు

  భక్తుని అంతిమ లక్ష్యం మోక్షమే. అంటే.. మరల మరల జన్మనెత్తవలసిన అవసరం లేకపోవటం. ఈ మోక్షసిద్దికి అయోధ్య, మథుర, మాయ, వారణాసి, కంచి, ఉజ్జయిని, పూరి వంటి సప్తక్షేత్ర దర్శనం ఒక మార్గమని భారతీయ పురాణాలు సూచిస్తున్నాయి. అయితే దక్షిణాదిన .. అందునా కర్ణాటక రాష్ట్రంలోనూ సప్తక్షేత్రాలకు సమానమైన 7 పుణ్యక్షేత్రాలున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ఆ పుణ్య క్షేత్రాల శతాబ్దాల చరిత్రను, అక్కడి విశేషాలను వివరంగా తెలుసుకొందాం.

ఉడిపి

శ్రీ కృష్ణ క్షేత్రాలలో పేరున్న క్షేత్రమిది. ఉడిపి అనే పేరు 'ఒడిపు' అనే తుళువపదం నుండి వచ్చింది. అంటే.. పవిత్ర గ్రామం అని అర్థం. మరో కథనం ప్రకారం.. ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు. అంటే చంద్రుడు. పరమేశ్వరుని కృపతో దక్ష శాపం నుండి చంద్రుడు విముక్తమైనది ఇక్కడేననీ, ఇక్కడి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయమే అందుకు రుజువని పూర్వీకుల విశ్వాసం. ద్వైత సిద్దాంత కర్త అయిన మధ్వాచార్యుల జన్మస్థలమూ ఇదే. ఆయన చేతుల మీదుగానే 13వ శతాబ్దంలో ఇక్కడశ్రీ కృష్ణ విగ్రహం, మఠ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

కుక్కె

దక్షిణ కర్ణాటకలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువై ఉన్న దైవం సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహారం తర్వాత స్వామిదేవేంద్రుని కుమార్తె అయిన దేవ సేనను వివాహమాడిన ప్రదేశమిది. ఆ రోజు స్వామిని అభిషేకించేందుకు పార్వతీ పరమేశ్వరులు తెచ్చిన పవిత్ర నదీజలాలే ఇక్కడి కుమారధార అని భక్తుల విశ్వాసం. గరుడుని వలన ప్రాణ భయంతోసర్పరాజు వాసుకి ఇక్కడ ప్రాణభయంతో ఇక్కడ తపస్సు చేయగా, పరమేశ్వరుని ఆదేశం మేరకు సుబ్రహ్మణ్యుడు వాసుకికి అభయమిచ్చినట్లు పురాణగాథ. అందుకే కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుంది. 

శంకర నారాయణ క్షేత్రం

దక్షిణాదిన గల సప్త మోక్ష క్షేత్రాల్లో మూడవది కర్ణాటకలోని శంకర నారాయణ క్షేత్రం. ఒకే పానువట్టం మీదహరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఏకైక క్షేత్రం ఇదొక్కటే. ఇక్కడి విష్ణు లింగం మీద కామ ధేనువు గిట్టల ముద్రలతో బాటు ఈ ఆలయంలో జయ విజయులతో బాటు నంది ఉండటం మరో ప్రత్యేకత. నాడు పరశురాముని చేత ప్రతిష్ఠితమైన ఈ లింగాన్నిగుర్తించి 1000 ఏళ్ళ క్రితం సోమశేఖర రాయ అనే రాజు కట్టించిన ఈ ఆలయపు ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.

కోటేశ్వర

ఉడిపికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో క్షేత్రమిది. శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారు కొలువైన ఈ ఆలయపుఏడు ప్రాకారాలలో కొన్ని కాలక్రమంలో ధ్వంసమైనాయి. ఆలయం బయటి అతిపెద్ద గద్దె మీదినుంచి గర్భాలయంలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామిని నేరుగా చూసే ఏర్పాటు భక్తులను అబ్బురపరుస్తుంది. 25 అడుగుల ఎత్తైన ఆలయ ప్రధాన ద్వారం, 100 అడుగుల ధ్వజస్తంభం, డమరుక ఆకృతిలో ఆలయ పుష్కరణి వంటివి ఆలయ ఇతర ప్రత్యేకతలు.

కుంభాషి

సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది కుంభాషి. ఉడిపికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గణేశ క్షేత్రం పాండవుల కాలం నాటిది. గర్భాలయంలో నిలువెత్తు రూపంలో నిండైన వెండి కవచంలో చతుర్భుజ గణపతి కొలువై ఉంటారు. కరువు పాలైన ఈ ప్రాంత ప్రజల బాధ చూసిన గౌతమ ముని వరుణ యాగం తలపెడతాడు. దాన్ని భగ్నం చేయడానికి కుంభాసురుడు అనే రాక్షసుడు రాగా భీమసేనుడు వానిని సంహరించాడట. తర్వాత యాగం నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట. అందుకే ఈ క్షేత్రానికి 'కుంభాషి' అనే పేరొచ్చింది. యాగారంభములో పాండవులు ప్రతిష్టించిన శ్రీ మహా గణపతి నేటికీ పూజలందుకొంటున్నాడు. ఇక్కడ బిలం నుండి ఊరే నీరు గంగగా చెబుతారు. దీనికి దగ్గరలో సూర్య పుష్కరణి, చంద్ర పుష్కరణి ఉంటాయి.

కొల్లూర్‌

 శ్రీ మూకాంబిక దేవి కొలువై ఉన్న క్షేత్రమిది. ఒకప్పుడు ఇక్కడ కోలా మహర్షి చేసిన తపస్సుకు అనుగ్రహించిన పార్వతీ పరమేశ్వరులు ఒక్క రూపులో ఇక్కడ కొలువయ్యారు. అందుకే లింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది. తర్వాతి కాలంలో ఆది శంకరులు ఇక్కడ అమ్మవారి శ్రీ చక్ర సహిత పంచలోహ విగ్రహాన్ని, శ్రీ చంద్రమౌలీశ్వర లింగాన్ని ప్రతిష్టించారట. ఏటా ఇక్కడ దేవి నవరాత్రులు, శివరాత్రి పండుగలకు విశేషంగా భక్తులు తరలి వస్తారు.

గోకర్ణం

కర్ణాటకలోని సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది గోకర్ణం. త్రేతాయుగాన రావణుడు ఈశ్వరుని తపస్సుతో మెప్పించి వరంగా ఆత్మలింగాన్ని పొందుతాడు. దాన్ని నేలమీద పెట్టరాదనీ, ఒకవేళ ఆ లింగం నేలకు తాకితే అక్కడే ప్రతిష్టితమవుతుందని శివుడు సూచిస్తాడు. అలా.. ఆ ఆత్మ లింగాన్ని తీసుకొని లంకా నగరానికి వెళుతూ సముద్రం ఒడ్డున సంధ్య వార్చేందుకు సిద్దమవుతాడు. దేవతల ప్రణాళిక ప్రకారం అక్కడ బాలుని రూపంలో గణపతిని పంపుతారు. కనిపించిన బాలుని చేతికి ఆ లింగాన్ని ఇచ్చి సముద్రంలో సంధ్య వార్చేందుకు రావణుడు వెళ్లగా 3 సార్లు పిలిచి ఆ బాలుడు ఆ లింగాన్ని అక్కడి నేలమీద వదలి వెళతాడు. నాటి నుంచి శ్రీ మహా బలేశ్వర స్వామిగా పరమేశ్వరుడు ఇక్కడ పూజలందుకొంటున్నాడు. ఉడిపికి 170 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. 

ఈ సప్త క్షేత్ర సందర్శన చేసుకొనే భక్తులు ముందుగా గోకర్ణం, ఆతరువాత ఉడిపి, కుక్కె లను దర్శించుకొని ఆ పిమ్మట కుందుపర వెళ్ళే దారిలో కుంబాషి, కోటేశ్వర సందర్శించుకొని కొల్లూరు మీదగా శంకరనారాయణను చేరుకోవటం అనువైన విధానం. ఇలా చేస్తే నాలుగు రోజులలో ప్రశాంతంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE