• HOME
  • భక్తి
  • మార్పుకు సంకేతం.. సంక్రాంతి

సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. ఇలా ఏడాదికి 12 సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

ఉత్తరాయణ పుణ్య కాలము

మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఇది శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన సమయం. దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. కనుకనే ఉత్తరాయణము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. ఆది శంకరాచార్యుడు సంక్రాంతి రోజునే సన్యాసం స్వీకరించినట్లు చెబుతారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా విశేష ఫలాన్ని ఇస్తుందని పెద్దల నమ్మకం. అందుకే.. ఈ పండుగ వేళ ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని విశ్వసిస్తారు. 

3 రోజుల పండుగ

తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. కొన్ని ప్రాంతాలలో దీన్ని మూడు రోజులు( భోగి, మకర సంక్రమణం, కనుమ)గా, నాలుగు రోజులుగానూ (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ధనుర్మాసారంభం మొదలు నెల రోజుల నుంచే  తెలుగు పల్లెల్లో సంక్రాంతి వాతావరణం కనిపిస్తుంది.  బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, జానపద కళాకారులు తయారవుతారు. నెలపట్టిన నాటినుంచే రోజూ ముంగిళ్ళను బియ్యం పిండితో వేసే ముగ్గులు,  గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. 

భోగి

పండుగ మొదటి రోజు భోగి. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. భోగి సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు.దీని లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. 

సంక్రాంతి

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు చేస్తారు. అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.  ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. 

కనుమ

మూడవ రోజయిన కనుమ పశువుల పండుగ. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE