మనిషి మనుగడకు మూలమైన ప్రకృతి ఆవిర్భవించిన రోజే ఉగాది. చాంద్రమానం ప్రకారం కాల గణన చేసేవారందరికీ చైత్ర శుద్ధ పాడ్యమే ‘యుగాది’. మన ఉనికికి ఆధారభూతమైన ప్రకృతి మాతను గౌరవిస్తూ జరుపుకొనే పండుగ ఇది. ప్రకృతిని ప్రేమించి పచ్చదనాన్ని రక్షించుకుంటే ఏనాటికీ మానవజాతి మనుగడకు ఢోకాలేదని అభయమిచ్చే పండుగ ఉగాది.
చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో చివరిదైన ఫాల్గుణమాసం నాటికి ఒకవైపు చెట్ల ఆకులు రాలి ప్రకృతి వెలవెల బోతుండగా తిరిగి నవనవోన్మేషమైన ప్రకృతి శోభలతో చైత్ర మాసం ప్రారంభమవుతుంది. వాతావరణంలో చలి స్థానంలో వేడి మొదలయ్యే సమయమిది . అందుకే.. వాతావరణం వేగంగా మరే ఈ సంధి సమయంలో ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఔషధ విలువలు కలిగిన ఆరు పదార్థాలను ఉగాది పచ్చడి రూపంలో తీసుకొంటాము.
పండుగ విధులు.. ప్రయోజనాలు
పండుగ నాటి ఉదయం అందరూ నువ్వుల నూనెను ఒంటికి పట్టించి, పసుపు కలిపిన సున్నిపిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, తలంటు స్నానం చేయాలి.దీనివల్ల శరీర తేజస్సు, దేహ తేజస్సు పెరుగుతాయి. పండుగనాడు ధరించే నూతన వస్త్రాలు నూతన ఉత్సాహాన్ని, నిండైన ఆయుష్షునీ ప్రసాదిస్తాయి. ఉగాది సాయం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాల సమాహారమైన పంచాంగ శ్రవణం వల్ల మనిషికి సంపద, ఆయుష్షు, పుణ్యం, ఆరోగ్యం, కార్యసిద్ధి కలుగుతాయి. షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరం వేసవిని తట్టుకొనేలా సిద్దమవుతుంది.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత
ఈ పచ్చడిలో వాడే బెల్లం రుచి తీపి. ఇది ఆనందానికి సంకేతం. ఇందులో వేసే ఉప్పు జీవిటానికి తప్పనిసరిగా కావలసిన ఉత్సాహానికి ప్రతీక. ఇందులో కలిపే వేప పువ్వు జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలకు గుర్తు. చింతపండు అందించే పులుపు కష్టకాలంలో చూపాల్సిన నేర్పును గుర్తుచేస్తాయి. పచ్చి మామిడి ముక్కల వల్ల పచ్చడికి చేకూరే వగరు మనం అధిగమించాల్సిన కొత్త సవాళ్లకు చిహ్నం. ఏ స్థితిలోనూ సహనం కోల్పోరాదని కారం చెబుతుంది.
మొత్తంగా బతుకు తీరును వివరించే విధానాల సమాహారమే.. ఉగాది. ఈ విళంబి నామ సంవత్సర ఆగమన వేళ పాఠకులందరికి ఉగాది శుభాకాంక్షలు…!