చైత్రమాసంలో చెట్లు కొత్త చిగుర్లు వేస్తాయి. చెట్ల లేలేత చిగుళ్ల మధ్య దాగిన కోకిలమ్మలు కమ్మగా గొంతెత్తి పాడతాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నాటి ఉగాది నుంచే సీతారామ కళ్యాణానికీ ఏర్పాట్లు మొదలవుతాయి. దేశం మొత్తం శ్రీరామచంద్రుని ఆరాధన ఉన్నా తెలుగువారు శ్రీరామనవమిని జరిపినట్టు మరెక్కడా కనిపించదు. ఉగాది నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వసంత నవరాత్రి వేడుకలు నవమినాటి సీతారామ కళ్యాణంతో పరిసమాప్తమవుతాయి. ఈ తొమ్మిది రోజులూ పిల్లల మొదలు పెద్దల వరకు అందరూ కళ్యాణ ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. ఈ సీతారామ కళ్యాణ పరమార్థం ఏమిటి? ఏటా ఈ కళ్యాణం ఎందుకు? వంటి అంశాలను ఈ శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకొందాం. 

మంగళదాయకం

   సీతారామకళ్యాణ ఘట్టాలను క్రమపద్ధతిలో పరిశీలిస్తే ఇందులో గల లోకకళ్యాణ కారక విషయాలు అర్థమవుతాయి. గురువు కోరికమీద బాలునిగానే రాక్షస సంహారం చేయటం, అక్కడి నుంచి మిథిలకు చేరుతూనే ఏళ్లుగా రాయిగా పడిఉన్న అహల్యకు శాపవిమోచనం కలిగించటం, జనకుని కొలువులో మహామహుల వల్ల కానీ శివధనుస్సుని విరవటం, సీతమ్మను పరిణయమాడటం, ఆ తర్వాత ఆ రాజ్యం కరువుకాటకాలు లేకుండా సుభిక్షంగా వర్ధిల్లటం ఇలా కళ్యాణానికి ముందు, తర్వాతి ఘటనలన్నీ మంగళకరంగా సాగుతాయి. అందుకే తమ ప్రదేశంలోనూ ఏటా సమయానికి వర్షం కురిసి పంటలు పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏటా చైత్ర శుద్ధ నవమినాడు యధాశక్తి సీతారామకళ్యాణం చేసి ప్రార్థించటం ఆనవాయితీగా వస్తోంది. 

తాత్విక అంశాలు

   సీతారామ కల్యాణంలో గొప్ప ఆధ్యాత్మిక తత్త్వం దాగిఉంది. నిజానికి మనిషిలోని ఆత్మే రాముడు. ఆ ఆత్మ యొక్క శక్తే సీతమ్మ. మనలోని అహంకారమే రావణుడు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలే అతని 10 తలలు. ఈ తలలు మన లోని ఆ ఆత్మశక్తిని అపహరించి మనం మన శక్తిని తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి. ఈ సమయంలో ప్రాణాయామ స్వరూపమైన వాయుపుత్రుని (హనుమ) సాయంతో మన శక్తిని తెలుసుకోవడమే సీతారామ కళ్యాణం. అదే విశ్వమానవకళ్యాణానికి నాంది. 

ఆదర్శ దంపత్యానికి ప్రతీకలు

వివాహం జీవితానికి నిండుతనాన్ని తెస్తుంది. వివాహం ద్వారా పూర్ణత్వాన్ని పొందిన మనిషి సతీసమేతంగా లోకకళ్యాణం కోసం కృషి చేయాలి. అందుకే వైదిక కర్మల్లో ధర్మపత్ని ఉండి తీరాలని చెబుతారు. ఇక..ఆదర్శ దంపతులనగానే సీతారాములే గుర్తుకొస్తారు. కొత్తజంటను సీతారాముల్లా బ్రతకమని ఆశీర్వదించటమే ఇందుకు నిదర్శనం. వివాహసమయంలో జనకుడు సీతను కన్యాదానం చేస్తూ నేటి నుంచి సీత నిన్నునీడలా అనుసరిస్తుందని చెప్పటాన్ని బట్టి భార్య, భర్తను ఎలా అనుగమించాలో, భర్త, భార్యను ఎట్లా ఆదరించాలో అర్ధం చేసుకోవచ్చు.

నేటి వివాహ సమస్యలకు పరిష్కారం

వివాహం ఏమిటో, వివాహంలో ఇరుపక్షాలవారూ ఎలా నడుచుకోవాలో, వివాహానికి ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలో, వివాహ పరమార్థం ఏమిటో, వివాహం తరువాత దంపతులు ఎలా మసలుకోవాలో సీతారామ కళ్యాణం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించి, ఆచరించగలిగితే నేటి మాదిరిగా చిన్న చిన్న కారణాలకే వివాహబంధాలు విచ్ఛిన్నం కావు. కౌన్సిలింగ్ సెంటర్ల అవసరమూ ఉండదు. 

చివరగా.. నవమి నాటి సీతారామ కళ్యాణ తలంబ్రాలు శిరసున ధరిస్తే శ్రీరామరక్ష లభించినట్లే. ఆ స్వామి ప్రసాదంగా అందించే పెసరపప్పు వడపప్పు, బెల్లం పానకం చైత్రమాసం నుండి పెరిగే ఎండల వల్ల కలిగే వేసవితాపం నుంచి ఉపశమనం కలిగించేవే. లౌకికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని తరింపచేసే ఆ సీతారామకళ్యాణాన్ని భక్తితో వీక్షించి ఆ స్వామి కృపను మనమంతా పొందుదాం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE