మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు మాత్రమే కాదు. తన జ్ఞానంతో ముక్తి మార్గాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. అందుకే మన ఉపనిషత్తులు ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల తరువాత గురువుకే ఆ స్థానాన్ని ఇచ్చి సత్కరించాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొన్నేళ్లు సాకి ఆ బిడ్డను తనకు అప్పగిస్తే ఇంచుమించు రెండు దశాబ్దాల అవిశ్రాంత కృషితో ఆ విద్యార్థిని మహా మనీషిగా తీర్చిదిద్దేది గురువే. గురువు, గోవిందుడు కలిసి ఎదురొస్తే నేను ముందు గురువుకే నమస్కారం చేస్తానని అంటాడు భక్తకబీర్ దాస్. అదీ మన సంస్కృతిలో గురువు స్థానం. అంతటి గురువును స్మరించి, పూజించి, కృతఙ్ఞతలు చెప్పటం కోసం మన పెద్దలు ఏడాదిలో ఒకరోజును నిర్ణయించారు. అదే గురు పౌర్ణమి. 

గురు పౌర్ణమి 

‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే తొలగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు. అందుకే.. గురువులకు గురువు,  18 పురాణాలు, ఉపనిషత్తులను రచించిన వ్యాస మహర్షి జన్మదినమైన ఆషాడ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకోవటం భారతీయుల సంప్రదాయం. సాక్షాత్తూ నారాయణుడి అంశ అయిన వ్యాస భగవానుడు ఈ రోజునే బ్రహ్మసూత్రాల రచనను ప్రారంభించారని కొందరి విశ్వాసం. అందుకె గురుపౌర్ణమిని వ్యాసపౌర్ణిమ అని కూడా అంటారు.

 ప్రజలను ధర్మ మార్గాన నడిపించే గురువులు ఈ రోజున ఎక్కడైతే వ్యాసపూజ చేస్తారో ఆ నాటి నుంచి 4 నెలల పాటు అదే ప్రదేశంలో ఉండి వైదిక విధులను ఆచరిస్తూ భక్తులకు బోధనలు చేస్తారు. గురుపౌర్ణమిని జైనులు,బౌద్ధులు కూడా జరుపుకొంటారు. జైనుల 24వ తీర్ధంకరుడైన మహావీరుడు ఈ ఆషాడ పూర్ణిమ రోజునే ఇంద్రభూతి గౌతముణ్ణి తన ప్రథమ శిష్యునిగా స్వీకరించి గురువయ్యాడు. గురుపౌర్ణమినాడు వ్యాసపూజ చేసిన పిదప  ప్రతి ఒక్కరూ యధాశక్తి తమ గురువుల్ని దర్శించి, సేవించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఈ పవిత్రమైన "గురుపౌర్ణమి" పుణ్యదినాన్ని భక్తితో జరుపుకుని పునీతులౌదాము.

 వ్యాస శ్లోకం

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే

నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమఃRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE