సినీ రంగాన వరుస విజయాలతో దూసుకెళుతున్న వర్థమాన తార.. రకుల్ ప్రీత్ సింగ్. తన అందం, అభినయంతో అనతికాలంలోనే ప్రేక్షకుల మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంది. మిస్ ఇండియాగా మెరిసినా, మోడల్ గా హొయలొలికించినా ఆమె ముద్ర సుస్పష్టం. సానుకూల దృక్పథమే తన విజయానికి కారణమంటున్న రకుల్ బీ పాజిటివ్ తో పంచుకొన్న కొన్ని విశేషాలు...

నటజీవితం ఎలావుంది ?

ముందుగా తెలుగు ప్రేక్షకులకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిరుడు వచ్చిన నా సినిమాలు మంచి విజయాన్ని సాధించటమే గాక వృత్తిపరంగా నాకు మంచి సంతృప్తిని ఇచ్చాయి. ఈ ఏడాది సైతం అలాగే ఉంటుందని ఆశిస్తున్నా.

చాలా గ్లామరస్ గా కనిపిస్తున్నారు. మీ అందం రహస్యం?

ఏ నటికైనా నటనతో బాటు అందం కూడా ప్రధానమే. మొదటి నుంచి రోజూ అరటిపండు గుజ్జు, నిమ్మరసం, తేనె వంటి సహజ పదార్థాలతో ప్యాక్ వేసుకోవటం, వారానికోసారి ఫ్రూట్ ప్యాక్ వేసుకోవటం అలవాటు. అందం కోసం కాస్మొటిక్స్, ఆధునిక చికిత్సల జోలికి పోను.

చాలా ఫిట్ గా ఉన్నారు. దీనికోసం ఎలాంటి వ్యాయామం చేస్తారు?

నాన్న వ్యాయామం చేస్తూ మా చేత కూడా చేయించేవారు గనుక చిన్నప్పటి నుంచి వ్యాయామం రోజువారీ దినచర్యలో భాగమై పోయింది. రోజూ ఒకే వ్యాయామం కాకుండా అవసరానికి తగిన వ్యాయామాలు ఎంపిక చేసుకొని గంటన్నర పాటు చేస్తా. ముంబైలో ఉంటే ట్రైనర్ చెప్పే వ్యాయామాలు సాధన చేస్తా. షూటింగ్, ప్రయాణ సమయంలో మాత్రం నాకు నచ్చినవి చేస్తా. వ్యక్తిగతంగా కిక్ బాక్సింగ్ వంటి ఇంటెన్స్ వర్కౌట్ ఇష్టం.

మీ ఫిట్ నెస్ రోల్ మోడల్?

వయసును బట్టి చూస్తే మిలింద్ సోమన్ ఫిట్ గా ఉంటారు. తరువాతి నటుల్లో అర్జున్ రాంపాల్, అక్షయ్ కుమార్.

డైట్ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటారు?

వేపుళ్ళు, చక్కెర ఎక్కువగా వాడిన వంటకాలకు నేను పూర్తిగా దూరం. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మొదలైన కీలక పోషకాలున్నఆహారాన్ని తీసుకుంటాను. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా అయిదారు విడతల్లో తగిన విరామంతో ఆహారం తీసుకుంటాను.

మీ డైట్ ప్లాన్

ఉదయం లేచిన అరగంటకు వెన్న తీసిన పాలతో కప్పు ఓట్స్, గుడ్డు తెల్లసొన ఆమ్లెట్ ఒకటి తీసుకుంటా. 3 గంటల తర్వాత 1 ఫ్రూట్ సలాడ్ తీసుకుంటా. (వారానికి రెండు మూడు రోజులు మాత్రమే). షూటింగ్ వల్ల అలసటగా అనిపిస్తే 1 గంట తర్వాత గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కప్పు అన్నం, పప్పు, ఆవిరిమీద ఉడికించిన చేప లేదా చికెన్ కొద్దిగా తీసుకుంటా. సాయంత్రం 4 గంటలకు కప్పు పండ్ల ముక్కలు లేదా పెరుగులో వేసిన స్ట్రాబెర్రీ లు, 6 గంటలకు మరోమారు కప్పు పండ్ల ముక్కలు తీసుకుంటా. రాత్రి భోజంలో 3 రోటీలు, పాలకూర, పప్పు, గ్రిల్ చేప తీసుకుంటా. ఇవి దొరక్కపోతే ఆకుకూర, పుట్ట గొడుగులు వేసి చేసిన ఆమ్లెట్ తో రొట్టె తింటాను. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 3 లేదా 4 గంటలు విరామం ఉండేలా చూసుకుంటా. ఏది తిన్నా వేళ తప్పకుండా చూసుకుంటా.

మీ హాబీలు?

గోల్ఫ్, స్విమ్మింగ్, టీవీ చూడటం

పని ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు?

పనిని ఆస్వాదించటం ద్వారా ఒత్తిడిని వీలున్నంత తగ్గించేందుకు ప్రయత్నిస్తా. అయినా ఎంతో కొంత ఒత్తిడి, అలసట తప్పవు. దానికోసం రోజూ కొద్దిసేపు ప్రాణాయామం, ధ్యానం చేస్తాను. వారానికోసారి నెగెటివ్ శక్తిని దూరం చేసేందుకు ప్రత్యేకంగా యోగా చేస్తాను.

ఆరోగ్య విషయంలో బీ పాజిటివ్ పాఠకులకు మీరిచ్చే సలహాలు?

ప్రతి విషయాన్నీ సానుకూలంగా ఆలోచించండి. అప్పుడు ఎంతపెద్ద సమస్య అయినా చిన్నదిగా కనిపించటమే గాక సులభంగా చేయటం సాధ్యమవుతుంది. దీన్ని అలవర్చుకుంటే ఏ ఒత్తిడి గానీ, అనారోగ్యం గానీ ఉండవు. ఈ సానుకూల దృక్పథమే మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE