మోహన్ బాబు కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన మంచు లక్ష్మి అంతటి కాలంలోనే తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అనగనగా ఒక ధీరుడు , గుండెల్లో గోదారి, కడలి, ఊ  కొడతారా ఉలిక్కిపడతారా, దొంగాట వంటి చిత్రాల్లో చక్కని నటనను ప్రదర్శించి విలక్షణ నటి అనిపించుకున్నారు. నటి, నిర్మాత, ప్రతినాయిక , టీవీ వ్యాఖ్యాత , గాయనిగా రాణిస్తున్నారు. ఆరోగ్యం కంటే విలువైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదనీ, దానికోసం ప్రతి ఒక్కరూ ఏంటో కొంత సమయం కేటా యించాలనీ అంటున్న మంచు లక్ష్మి బి పాజిటివ్ తో పంచుకున్న విశేషాలు ....

చిన్ననాటి ముచ్చట్లు , చదువు సంధ్యలు ..

పదోతరగతి వరకు మద్రాస్ లోనే గడిచింది. అక్కడ ఉండగా ఎక్కువగా తమిళం , హైదరాబాద్ వచ్చాక హిందీ మాట్లాడటం అలవాటయ్యింది. దీంతో తెలుగు మాట్లాడే అవకాశం తక్కువే. మాట్లాడే విషయంలో ఎప్పుడూ బెరుకు లేదు. నాన్నగారు ఉదయం 5 గంటలకే మమ్మల్ని లేపి  వైఎంసీఎ కి రన్నింగ్ కోసం తీసుకెళ్ళే వారు. ఇంటర్ నాటికి  హైదరాబాద్ వచ్చేశాం. అప్పటినుంచి  కేబీఆర్  పార్క్ లో  పరుగులు పెట్టే వాళ్ళం. తర్వాత ఫై చదువుల కోసం అమెరికా వెళ్ళాను. ఈ మధ్యలో జేడీ కాలేజీ అఫ్ ఫాషన్ డిజైనింగ్ నుంచి కోర్సుతో బాటు నిఫ్ట్ నుంచి టెక్స్ట్ టైల్ డిజైనింగ్ లో కోర్సు చేశా. మొదటినుంచీ సినిమాకు దగ్గరగా ఉన్న రంగాలనే ఎంచుకున్నా.

నటిగా మీ ప్రయాణం..

ఒక జూనియర్ ఆర్టిస్టుగా అమెరికాలో  నా కెరీర్ ఆరంభించాను. అక్కడ ఏదైనా టీవీ షో ఆడిషన్స్ జరిగితే వందలమంది పోటీ పడతారు. అందునా ఛాయ తక్కువ వారు, తూర్పు దేశాలవారు వాటిలో అర్హత సాధించటమే గగనం . అయినా ఆత్మ విశ్వాసంతో సెలక్షన్స్ కు వెళ్లి ఎంపికయ్యా.రంగస్థలం మీద అవగాహన ఉంటేనే సహజమైన నటన సాధ్యం. అందుకే  ఒక్లహామా లో థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా కోర్సు చేశా. అక్కడే సిల్వెస్టర్ స్టాలోన్, జేమ్స్ కాన్స్ వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.

నాన్నగారితో మీ అనుబంధం.

ఆయన అత్యంత నమ్మదగిన, ఆధారపడదగిన వ్యక్తి. వారి వ్యక్తిత్వమే వారి ఆస్తి. కేవలం నాన్నగానే గాక మంచి స్నేహితుడుగా, శ్రేయోభిలాషిగా, మార్గదర్శిగా ఉంటారు . మేము చేసే ప్రతి పనిలోనూ ఆయన ముద్ర ఉంటుంది. ఎప్పుడూ దేనికీ కంగారు పడరు. జయాపజయాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని చెబుతుంటారు. విలువలతో కూడిన జీవితాన్ని కోరి, ప్రేమించి, ఆచరించే వ్యక్తి . పట్టుదల, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల తెగువ ఆయననుంచే అబ్బాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయనను ఒక్కసారి తలచుకుంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇలా ఆయన గురించి యెంత చెప్పినా తక్కువే. 

సినీ రంగాన సొంత ముద్ర ఎలా సాధించారు?

నటుడు, విద్యావేత్త, నిర్మాత గా విజయవంతమైన వ్యక్తికి వారసురాలిగా సినీ రంగాన అడుగు పెట్టాను. ఆయన సలహాలు తీసుకుంటూనే నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుండే పాత్రలు వేస్తూ సాగాను. ఏ రంగంలోనైనా మన ప్రతిభ, కృషి, నిబద్ధత మాత్రమే మనల్ని విజయ తీరాలకు చేర్చుతాయే తప్ప కేవలం వారసత్వమో మరోటో కాదని నేను పూర్తిగా నమ్ముతాను.

నటన విషయంలో ఆయన సలహా తీసుకుంటారా?

తప్పకుండా. సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆయనకు చక్కని అవగాహన వుంది గనుక మార్గదర్శి గా ఉంటారు. అదే సమయంలో నటన విషయంలో తగినంత స్వేచ్ఛనూ ఇస్తారు. రెండు, మూడు సినిమాలకే మాకు బోలెడంత అనుభవం వచ్చేలా తర్ఫీదు ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం నేనెంతో లక్కీ. నటన గురించి  మాట్లాడేటప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా చెప్పేస్తారు. ఒక సన్నివేశం ఎలా చేస్తే బాగుంటుంది? ఎలా చేయకూడదో కూడా కారణాలతో సహా చెప్పేస్తారు. 

తమ్ముళ్ళలో ఎవరితో చనువుగా ఉంటారు?

చూసే వాళ్లకి మనోజ్ తో దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది గానీ విష్ణుతోనూ అనుబంధం ఎక్కువే. మనోజ్ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనో, ఆట పట్టిస్తూనో ఉంటాడు. విష్ణు తక్కువగా మాట్లాడినట్లు ఉంటాడు గానీ ఎక్కడున్నా నా బాగోగులు తెలుసుంటూ ఉంటాడు. నాకు ఏదైనా సమస్య వస్తే ముందు మాట్లాడేది విష్ణుతోనే.

మీ పాపాయి ముచ్చట్లు?

పేరు విద్యా నిర్వాణ. అల్లరి ఎక్కువే. ఇంట్లో అందరికీ దానితోనే కాలక్షేపం. చదువుకు మా కుటుంబం ఇచ్చే ప్రాధాన్యం, ఆది శంకరుల నిర్వాణ షట్కం ప్రభావం  ఆ పేరు పెట్టటానికి కారణాలు.

మీ వారి గురించి?

మేము భార్యాభర్తలుగా కంటే మంచి స్నేహితులుగా ఉంటాం. ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. నన్ను బాగా అర్ధం చేసుకున్న మనిషి. నేనింత స్వేచ్ఛగా నా పని చేసుకోవటం వెనక ఆయన సహకారం ఎంతో ఉంది.

అవీ..ఇవీ

ఎదుటి వారిలో నచ్చేవి                       సెన్సాఫ్ హ్యూమర్

నచ్చనివి                                     ఈగో

నచ్చే రంగు                                  ఎరుపు

ఫేవరెట్  నటుడు                            బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ , తెలుగులో నాగార్జున

ఇష్టమైన నటి                               చాలామందే. నిత్యామీనన్, రకుల్, తమన్నా , సమంతా

ఫేవరెట్ సింగర్                              యస్పీ బాలు గారు

మెచ్చే దర్శకులు                           మణిరత్నం

సంగీత దర్శకులు                           ఇళయ రాజా, రెహ్మాన్

ఇష్ట దైవం                                   శంకరుడు

ఇష్టపడే హాలిడే స్పాట్                      బీచ్ ఉన్న ఈ ప్రదేశమైనా ఓకే

మీకు నచ్చే ఆహారం                        అమ్మ చేతి వంట

నాన్నగారి సినిమాల్లో నచ్చే మూవీ          అల్లుడుగారు

 

మీ దృష్టిలో ఆరోగ్యంగా ఉండటం అంటే ?

ఆనందంగా ఉండటమే. ఉన్నదాంతో తృప్తి పడే వారంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. నేను రోజూ వ్యాయామం చేస్తాను. నా దినచర్య వ్యాయామానికి ముందు, తర్వాత అనేలా ప్లాన్ చేసుకుంటాను. రోజూ కాసేపైనా వ్యాయామం చేస్తూ, ఉన్నంతలో మంచి ఆహారం  తీసుకుంటే చాలావరకూ ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరవు. ఎలాంటి అనారోగ్యం లేదనే ధీమాతో ఇష్టం వచ్చిన రీతిలో జీవించే వారు భవిష్యత్తులో ఇబ్బందుల పాలు కాక తప్పదు. ఒక్కోసారి  చిన్న అనారోగ్యమైనా బాగా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందుకే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. అది లేనప్పుడు ఎంత  పేరు, డబ్బు ఉన్నా ఉపయోగం లేదు గనుక ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెట్టాల్సిందే.

ఫిట్ నెస్ కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తారు?

రోజువారీ వ్యాయామాలతో బాటు యోగా  చేస్తాను. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విపాసన సాధన చేస్తాను. కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంటాను. ఇప్పటి రోజుల్లో మానసిక ఒత్తిడి లేని మనిషే లేదు. ఎవరి స్థాయిలో వారికి సమస్యలు ఉన్నాయి. అలాగని మనిషి దేనినీ వదిలి పెట్టుకోలేని దుస్థితి. ప్రాధమిక స్థాయిలో చేసే యోగా, ప్రాణాయామం వంటివి కూడా ఒత్తిడిని అధిగమించేందుకు ఎంతగానో దోహదపడతాయి.

 

సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?

ఆరోగ్యం విషయంలో  మరీ ముఖ్యంగా బ్రెస్ట్ కాన్సర్ అవగాహనా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను. మౌలిక వైద్య సదుపాయాల లేమి ,  అవగాహనా రాహిత్యం మూలంగా నివారించదగిన ఎన్నో  అనారోగ్యాల పాలవుతున్నాం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భ్రూణ  హత్యల నివారణ కోసం కూడా పలు అవగాహనా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నాను. పరిశుభ్రత ఆవశ్యకతను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ గారు ఆరంభించిన స్వచ్చ భారత్ కార్యక్రమానికి ప్రచార కర్తగా ఉన్నాను. నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా నేను ఉత్సాహంగా ముందుకొస్తాను. అది నా బాధ్యత అనుకుంటాను.

 ఆరోగ్యం విషయంలో 'బీ పాజిటివ్' ద్వారా మీరిచ్చే  సలహాలు, సూచనలు ఏమిటి?

సంతృప్తిగా జీవించటం, వీలున్నంత వరకు మనసు చెప్పేది వినటం, ఉన్నంతలో మంచి ఆహారం తీసుకోవటం మరచిపోవద్దు. తాగునీటి విషయంలో అత్యంత శ్రద్ధ అవసరం. సమయానికి తినటం, నిద్రపోవటం కూడా అవసరమే. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించటం మరచిపోవద్దు.

డైట్ ప్లాన్

ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఫాలో కాను. చిరు తిళ్ళుగా నువ్వులుండలు, పల్లీ చిక్కి తీసుకుంటాను. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సీ ఫుడ్ కు ప్రాధాన్యం ఇస్తాను. వాతావరణాన్ని బట్టి ఆహారంలోనూ చిన్నపాటి మార్పులు చేసుకుంటాను.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE