ఈ రోజుల్లో ఏ సూపర్ మార్కెట్ లో చూసినా శీతల పానీయాల సరసనే ఎన్నో రకాల ఎనర్జీ డ్రింక్ కనిపిస్తున్నాయి. ఆటలు ఆడినప్పుడు  ఉత్సాహం వస్తుందని యువత కూడా వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఆకట్టుకొనే ప్యాకింగ్, మంచి రుచి, ప్రకటనల ప్రభావం వంటి ఎన్నో కారణాల వల్ల ఈ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. తక్కువ సమయంలో ఎంతో శక్తినిస్తాయని చెబుతున్న ఈ డ్రింక్స్ వల్ల నిజంగా ఉపయోగం ఉందా? ఒకవేళ ఉంటే ఏ మేరకు? వీటిని దీర్ఘకాలం పాటు తీసుకుంటే ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయా? వంటి అంశాలపై మాత్రం చాలామందికి స్పష్టత లేదు. ఎనర్జీ డ్రింక్స్ విషయంలో ఉన్న ఈ అపోహలకు నిపుణులు ఇస్తున్న వివరణ ఏమిటో తెలుసుకుందాం.

అపోహ: ఎనర్జీ డ్రింక్స్ వల్ల జీవక్రియల ( మెటబాలిజమ్) వేగం పెరిగి మంచి శక్తి వస్తుంది.

వాస్తవం: తొలిసారి లేదా అరుదుగా వీటిని తాగినప్పుడు జీవక్రియల వేగం పెరిగి ఉత్సాహంగా అనిపించే మాట నిజమే. అయితే రోజూ తాగితే మాత్రం శరీరంలో కార్బోహైడ్రేట్స్, కెఫీన్ నిల్వలు పెరిగి జీవక్రియలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.ఈ అలవాటు కొనసాగితే వ్యసనంగా కూడా మారొచ్చు. 

అపోహ: ఎనర్జీ డ్రింక్స్ లో ప్రమాదకర స్థాయిలో కెఫీన్ ఉంటుంది.

వాస్తవం: ఇప్పుడు మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఎక్కువగా వుండేమాట నిజమే గానీ అది ప్రమాదకరస్థాయిలో మాత్రం కాదు. ఆ మాటకొస్తే మార్కెట్లో లభించే ఎన్నో శీతల పానీయాల్లో సైతం కెఫీన్ ఉంటుంది. అయితే ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ కేలరీలు, కెఫీన్  శరీరానికి అందుతాయి గనుక అందుకు తగిన వ్యాయామం చేసి వీటిని అదుపుచేసే ప్రయత్నం చేయాలి. 

అపోహ: ఒకసారి ఎనర్జీ డ్రింక్ తాగితే ఆ  ప్రభావం దీర్ఘ కాలం ఉంటుంది. 

వాస్తవం: ఇది కేవలం అపోహే. తీసుకున్న కాసేపు కాస్త ఉత్సాహం అనిపించినా అది రక్తంలో కలిసి పోయిన కాసేపటికే శక్తి స్థాయి పూర్వస్థితికి వస్తుంది. అదేపనిగా వీటిని తాగటం వల్ల శారీరక క్రియలు దెబ్బతిని గుండెవేగం పెరగటం, అధిక రక్తపోటు వంటి సమస్యలు రావచ్చు. 

అపోహ: యువకులు ఎనర్జీ డ్రింక్ ఎన్ని తాగినా ఏమీ కాదు.

వాస్తవం: ఎక్కువసేపు ఆటలు ఆడేటప్పుడు వంటి ఒకటీ అరా సందర్భాల్లో తప్ప రోజూ తాగితే యువకులకైనా అనారోగ్యం తప్పదు. ఇది అలవాటుగా మారితే కొన్నాళ్లకు అది లేకుండా ఉండలేని ఇబ్బందికర పరిస్థితి కూడా రావచ్చని పలు పరిశోధనల్లో రుజువైంది. పండ్ల రసాలతో పోల్చితే వీటిలో చెప్పుకోదగినన్ని పోషకాలూ ఉండవు. 

అపోహ: ఆటగాళ్లు మైదానంలో చక్కని ప్రతిభ చూపేందుకు ఇవి ఉపయోగపడతాయి.

వాస్తవం: ఇదంతా ప్రకటనల మూలంగా ఏర్పడిన అపోహే తప్ప ఇందులో ఒక్కశాతం కూడా నిజంలేదు. ఎనర్జీ డ్రింక్ తాగటం వల్ల తాత్కాలిక ఉత్సాహం వచ్చినా అది ఆటలో మెరుగా రాణించేందుకు దోహదం చేస్తుందని చెప్పటం అతిశయోక్తి తప్ప వాస్తవం కాదు. 

గమనిక: ఎనర్జీ డ్రింక్స్ ఎప్పుడు కొనుగోలు చేసినా వాటి తయారీకి వాడిన పదార్థాల వివరాలు, తయారీ తేదీ వంటి వివరాలు తప్పక గమనించాలి. ఒక్కోసారి వాటిపై ముద్రించిన మేరకే ఆయా పదార్థాల వినియోగం జరిగిందా అనేది ఖచ్చితంగా చెప్పటం కాస్త కష్టమే.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE