• HOME
  • ఫిట్‌నెస్
  • 20 రోజుల్లో ఫిట్‌నెస్ పెంచే మిక్సిడ్ వర్కవుట్‌ ప్లాన్

మీరు ఫిట్‌నెస్ పెంచాలనుకుంటున్నారా? వీలున్నంత తక్కువ సమయంలోనే దీన్ని సాధించాలనుకుంటున్నారా? అయితే.. ఇలాంటివారి కోసం నిపుణులు రూపొందించిన మిక్సిడ్  వర్కవుట్‌ ప్లాన్ సాధన చేయాల్సిందే. రెండు దశల్లో కొనసాగే ఈ 20 రోజుల ప్రణాళికకు సంబంధించిన మరిన్నివివరాలు..

తొలిసగం.. సన్నాహకమే

ఈ 20 రోజుల మిక్సిడ్  వర్కవుట్‌ ప్లాన్ లో మొదటి 10 రోజులు నిపుణుల పర్యవేక్షణలో జిమ్‌లో అన్ని రకాల వర్కవుట్లు సాధన చేయాలి. అసలు ప్రణాళికకు శరీరాన్ని, మనసును అన్నివిధాలా సిద్ధం చేయటమే దీని లక్ష్యం. దీనివల్ల శరీర కదలికలు సులభతరమవటమే గాక మన ఫిట్‌నెస్ స్థాయి ఏమిటనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు, తీసుకొంటున్న చికిత్స వివరాలు, ఎత్తుబరువు, జీవనశైలి, గతంలో జరిగిన సర్జరీలు వంటి వివరాలను నిపుణులతో పంచుకోవాలి. వీటిని బట్టి ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాల్సివస్తే చేస్తారు . ఇలా నిపుణులు సూచించే వ్యాయామాలు 10 రోజులపాటు సాధన చేసిన తర్వాత అసలైన మిక్సిడ్  వర్కవుట్‌ ప్లాన్ సాధన మొదలవుతుంది.

అసలు ప్రణాళిక

ఇందులో మొదటి రోజు.. గుండె, కాలేయం బలోపేతమయ్యే కసరత్తులతో బాటు బరువు తగ్గడానికి కొన్నిప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. రెండో రోజు పొట్ట, తొడ, చేతులు, ఇతర కండరాలను బలపరచే వ్యాయామాలుంటాయి. వీటివల్ల ఒంట్లోని అదనపు కొవ్వు కూడా కరుగుతుంది. మూడోరోజు పవర్‌ యోగా సాధన చేయాల్సి ఉంటుంది. దీనివల్ల శరీరం చురుగ్గా పనిచేయటమే గాక కండరాలు బలపడతాయి. నాలుగో రోజు శరీర కదలికలను సమతుల్యం చేసే 'పైలెట్స్‌' సాధన చేయాలి. దీనివల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఐదోరోజు కసరత్తులో భాగంగా ఏరోబిక్స్‌ సాధన చేయాలి. గుండె ఆరోగ్యానికి, కండరాల పటుత్వానికి, చక్కని ఏకాగ్రతకి ఇవి దోహదం చేస్తాయి. ఏరోబిక్స్ చేసేటప్పుడు మంచి ఊపున్న సంగీతం కూడా తోడైతే మరింత ఉల్లాసంగా ఉంటుంది. ఆరో రోజు ప్రణాళికలో భాగంగా జుంబా డాన్స్‌ ఉంటుంది. దీనివల్ల మానసిక ఉల్లాసంతో బాటు శరీర కదలికలు సులభతరమవుతాయి. ఏడోరోజు కండరాల బలానికి, బరువు తగ్గడానికి నిర్దేశించిన ప్రత్యేక వ్యాయామాలుంటాయి. ఎనిమిదో రోజు కేవలం స్విమ్మింగ్‌ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయటమే గాక కండరాలకు విశ్రాంతినిచ్చే వ్యాయామం. జీవక్రియలు కూడా ఊపందుకొంటాయి. తొమ్మిదో రోజు సాధనా అంశం.. కిక్‌బాక్సింగ్‌. దీనికి ఎంతో శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల శరీరంలోని అనవసరపు కొవ్వు చాలా వరకు కరుగుతుంది. ఇక.. చివరిరోజు వ్యాయామ ప్రణాళికలో భాగంగా సైక్లింగ్‌, జాగింగ్‌ వంటివి సాధన చేయాల్సి ఉంటుంది. 

గమనిక: నిపుణులున్న జిమ్ లో సభ్యత్వం తీసుకొన్నప్పుడే ఇలాంటి ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. అలాగే.. ఈ ప్లాన్ కొన్నిరోజులు సాధన చేసి మధ్యలో వదిలేసి తర్వాత కొనసాగిస్తే ఉపయోగం ఉండదు. కనుక దీన్ని సాధన చేయాలనుకొనే వారు 20 రోజుల పూర్తి సమయాన్ని ఇందుకోసం కేటాయించి పక్కనబెట్టుకోవాల్సిందే.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE