వానాకాలం వచ్చేసింది. వర్షాల ప్రభావం, పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ సీజన్ అంతా తరచుగా జలుబు, తలనొప్పి, గొంతు గరగర, నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం సహజమే. ఇలాంటి సమస్యలకు అల్లం టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అల్లం టీ తాగటం వల్ల కలిగే ఉపయోగాలు, తయారీ వివరాలు తెలుసుకుందాం.
ఉపయోగాలు
- వానాకాలంలో ఉదయాన్నే వేడి వేడి అల్లం టీ తాగితే బద్ధకం వదిలిపోయి ఉత్సాహంగా పనిలోకి దిగొచ్చు.
- జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి బాధితులు రోజుకు 2 సార్లు అల్లం టీని తాగితే ఉపశమనం లభిస్తుంది.
- రోజూ ఓ కప్పు అల్లం టీ, తేనె కలిపి తీసుకుంటే ఉబ్బసం, తీవ్రమైన దగ్గు అదుపులో ఉంటాయి.
- నీరసం, తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సినప్పుడు అల్లం టీ తాగితే ఉపశమనం కలుగుతుంది.
- రోజూ ఉదయం పూట అలవాటుగా ఓ కప్పు అల్లం టీ తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- వేవిళ్ళ సమస్యకు అల్లం టీ మంచి ఉపశమనకారిణి.
- కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి, గుండెల్లో మంట తదితర జీర్ణకోశ సంబంధిత సమస్యలకు అల్లం టీ మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్లం టీ లోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి.
- మోకాలి నొప్పులు,వాపులు కీళ్ల నొప్పుల నివారణ, ఉపశమనానికి అల్లం టీ చక్కని విరుగుడుగా పనిచేస్తుంది.
గమనికలు
- మితం తప్పితే అమృతమైనా విషమే అవుతుందన్నట్లు.. రోజుకు 4 సార్లకు మించి అల్లం టీ తాగకూడదు. మరీ ముఖ్యంగా అల్సర్ బాధితులకు అల్లం టీ అసలే పనికిరాదు.
- శరీర తత్వంలో తేడా, కొన్ని రకాల అనారోగ్య సమస్యలున్నవారు అల్లం టీ తాగితే కడుపులో వికారంగా అనిపించటం వంటి ప్రతికూల లక్షణాలు కనిపించొచ్చు. ఇలాంటివారు ఒకసారి వైద్య సలహా తీసుకోవటం మంచిది.
తయారీ
కావలసినవి : 2 గ్లాసుల పాలు, 2 చెంచాల చక్కెర, చెంచా టీపొడి, పావు చెంచా యాలుక పొడి, అంగుళం పొడవున్న అల్లం ముక్క, గ్లాసు నీళ్ళు
తయారీ
ముందుగా పాలు, నీళ్ళు మరిగించి చక్కెర, టీపొడి వేసి తర్వాత అందులో అల్లం చితకగొట్టి వేసి, చివరగా యాలకుల పొడి వేసి కలిపి మరింతగా మరిగించాలి. దీనిని వడకట్టి వేడివేడిగా తాగేయాలి. హడావుడిగా కాకుండా సన్నని మంట మీద నెమ్మదిగా తగినంత సేపు మరిగిస్తే టీ మరింత రుచిగా ఉంటుంది.