పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే దక్షిణాది వంటకం.. పులగం. రుచికి కమ్మగా ఉండే పులగం పోషకాల పరంగానూ ఘనమైనది. త్వరగా తయారు చేసుకోదగిన ఈ అల్పాహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది. సంక్రాంతి పండుగ తొలి రోజైన భోగి నాడు పులగం వండటం తెలుగువారి సంప్రదాయం. ఇన్ని విశేషాలున్న పులగం తయారీ ఎలాగో చూద్దాం.
కావలసిన పదార్థాలు
బియ్యం - పావుకిలో
పెసరపప్పు - 100 గ్రా
పచ్చిమిర్చి - 6
ఆవాలు, జీలకర్ర - పావు చెంచా
అల్లం - అంగుళం ముక్క
కొత్తిమీరతరుగు - గుప్పెడు
జీడిపప్పు - 10
మిరియాలు - 10
నెయ్యి - 4 చెంచాలు
నూనె - 2 చెంచాలు
ఉప్పు - రుచికి తగినంత
తయారీ
బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. వెడల్పాటి గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు వరసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళు పోసి మరిగించాలి. ఎసురు మరగటం మొదలుకాగానే అందులో నానబెట్టి కడిగిన బియ్యం, పెసర పప్పు వేసి ఉడుకు పట్టగానే తగినంత ఉప్పు వేసి కలపాలి . పులగం అడుగంటకుండా సన్నని సెగ మీద ఉడికించాలి. ఉడకటం కాగానే దించి కొత్తిమీర చల్లి కాస్త నెయ్యి, ఏదైనా రోటి పచ్చడితో వేడి వేడిగా ఆరగించాలి.