డ్రై ఫ్రూట్స్ జాబితాలో బాదంపప్పుది ఎంతో ప్రత్యేకమైన స్థానం. రుచితో బాటు ఆరోగ్యాన్ని అందించే బాదంపప్పును అత్యంత మేలైన పోషకాహారం. శారీరక, మానసిక ఆరోగ్యానికి, సౌందర్య పరిరక్షణకు, వంటకాల రుచిని రెట్టింపు చేసేందుకు బాదం పప్పు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెదడు పనితీరును ఇది మెరుగుపరుస్తుంది. పిల్లల జ్ఞాపక శక్తి బాగుండాలన్నా, పెద్ద వయసులో వచ్చే మతిమరుపు వంటి సమస్యలు దరిజేరకుండా ఉండాలన్నా రోజువారీ ఆహారంలో బాదంపప్పుకు స్థానం కల్పించాల్సిందే. బాదంపప్పులో ఉండే పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బాదంపప్పులోని క్యాల్షియం ఎముకల బలోపేతానికి దోహదం చేస్తుంది .
- ఇందులోని విటమిన్ బి6,విటమిన్ ఈ, పొటాషియం, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లములు దెబ్బతిన్న మెదడు కణాలను బాగుచేసేందుకు, చక్కని జ్ఞాపక శక్తికి దోహదపడతాయి.
- బాదంపప్పులో లభించే జింక్ రోగనిరోధక శక్తిని పెంచి హానికారక ఫ్రీ రాడికల్స్ పనిబడుతుంది.
- మాంసకృత్తులు అధికమొత్తంలో అందించే బాదంపప్పు కండరాల బలోపేతానికి, మంచి శరీర సౌష్టవానికి ఉపయోగపడుతుంది.
- ఇందులో అధికంగా ఉండే ఐరన్, కాపర్, ఫాస్పరస్ వంటి ధాతువులు జీవక్రియల నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తాయి.
- గేదె, ఆవుపాలు తాగని పిల్లలకు బాదంపాలు ఇస్తే పాలలో లభించే అన్ని పోషకాలూ లభించినట్లే.
- రోజూ కనీసం 5 నానబెట్టిన బాదం గింజలు తింటే పని ఒత్తిడిని అధిగమించవచ్చు. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
- బాదంపప్పును నేరుగా తినని వారు సలాడ్స్, డెజర్టులు, గ్రేవీగా బాదంపప్పును వాడుకుంటే రుచితో బాటు ఆరోగ్యం కూడా.
- రోజూ బాదంనూనె ఒంటికి రాసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఈ నూనె జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.
- బాదంపప్పును నానబెట్టి పాలతో రుబ్బి రోజూ ముఖానికి, ఒంటికిరాసుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది.
గమనిక: బాదంపప్పును పొట్టుతో బాటు తిన్నప్పుడే అన్ని పోషకాలు అందుతాయి.
రుచి బాగుందని బాదంపప్పును అతిగా తినరాదు.