నువ్వు మొక్క పూలజాతికి చెందినది . ప్రపంచ వ్యాప్తంగా 3000 వేల సంవత్సరాలకు పైగా నువ్వులను ఆహారంలో, సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. కమ్మని వాసన, ఆకట్టుకునే రంగు, రూపం,  మంచి రుచి వీటి  ప్రత్యేకత. రోజూ గుప్పెడు నువ్వులు తీసుకుంటే శరీర పోషణకు అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు అందినట్లే. మన దేశీయ వంటకాలు, పచ్చళ్ళ తయారీలో నువ్వుల వినియోగం చాలా ఎక్కువ. సౌందర్య పోషణ లో, అందునా ముఖ్యంగా  కేశ, చర్మ సంరక్షణలో  నువ్వులది ప్రధాన పాత్ర . ఆయుర్వేదం ప్రస్తావించే నాలుగు ముఖ్యమైన గింజలలో నువ్వులకూ స్థానం ఉంది .  బర్మా , చైనా, పలు ఆఫ్రికా దేశాలలో నువ్వు పంట ఎక్కువగా సాగులో ఉన్నప్పటికీ అత్యధిక మొత్తంలో నువ్వులు పండించే దేశం మనదే . ప్రతి వంద గ్రాముల నువ్వుల్లో 573 కిలో కేలరీల శక్తి, 23.4  గ్రాముల కార్బో హైడ్రేట్లు, 17.7 గ్రాముల ప్రోటీన్లు, 50 గ్రాముల కొవ్వు, 11. 8 గ్రాముల పీచు ఉంటాయి. 

 ఆరోగ్యపరమైన ఉపయోగాలు

 • నువ్వుల్లోని అమైనో ఆమ్లాలు, మెగ్నీషియం, మాంసకృత్తులు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడతాయి.
 • నువ్వులు వాడకం వల్ల రక్తపోటు, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 • అనీమియా వంటి రక్త సంబంధిత సమస్యలకు నల్ల నువ్వుల వినియోగం చక్కని పరిష్కారం.
 • నువ్వుల్లోని 'సేసామిన్' అనే యాంటీ ఆక్సిడెంట్ కండరాల నొప్పులు, వాపుల నివారణకు, హృదయ సంబంధిత అనారోగ్యాల నివారణకు దోహద పడుతుంది.
 • నువ్వుల్లోని మోనో సాచురేటేడ్ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.
 • నువ్వుల్లోని పీచు మలబద్ధకం తో సహా అన్ని రకాల జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.
 • నువ్వుల్లోని పలు ఎముకలు, కీళ్ళ పని తీరు మెరుగు పరచే  ఔషధ గుణాలున్నాయి.
 • కాపర్, జింక్, కాల్షియం వంటి పోషకాలు ఎముకలు గుల్లబారటం మొదలు పలు సమస్యలు రాకుండా చూస్తాయి.
 • నువ్వుల వినియోగంతో ఆస్తమా తదితర శ్వాసకోస సమస్యలు ఉపశమిస్తాయి.

సౌందర్య పోషణలో....

 • నువ్వుల నూనె రాసిన చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. రోజూ కొద్దిగా నువ్వుల నూనెను ముఖానికి రాసి మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడుక్కుంటే సాగి వేళ్ళాడుతున్న చర్మం బిగుతుగా మారి కాంతులీనుతుంది.
 • పగిలిన కాలి మడమలకు వరుసగా రెండు, మూడు రోజులు కాస్త నువ్వుల నూనె రాసుకుని సాక్సులు వేసుకుంటే చెప్పలేనంత మెరుగుదల కనిపిస్తుంది.
 • నువ్వుల నూనెలోని ఒమేగా 3, 9 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు చక్కని పోషణను ఇస్తాయి. తరచూ గోరు వెచ్చని నువ్వుల నూనెను జుట్టు కుదుళ్ళ నుంచి పట్టించి మర్దనా చేస్తే, తల భాగంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. తలలోని పుండ్లు, చుండ్రు కూడా మటుమాయం అవుతాయి.

నువ్వుల ఉండలు

కావలసిన పదార్థాలు: నువ్వులు- 1 కప్పు, బెల్లం తురుము - కప్పున్నర, యాలకుల పొడి- అర చెంచాడు, జీడి పప్పు, కిస్ మిస్ పలుకులు- 2 చెంచాలు, తాజా నెయ్యి- 2 చెంచాలు.

తయారీ:  నువ్వుల్ని జల్లెడ పట్టి, సన్నని సెగ మీద మూకుడులో వేయించుకుని, దించి చల్లారనివ్వాలి. తర్వాత నువ్వులు, బెల్లం తరుగు, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకుని నిమ్మకాయంత చొప్పున తీసుకొని నెయ్యి అద్దుకుంటూ ఉండలు కట్టుకోవాలి. ఇలా చేసిన ఉండలను రోజుకొకటి చొప్పున తింటే కఫదోషాలు తొలగి పోవటమే గాక సరిపడా ఐరన్ లభిస్తుంది.

 

 

 

 

 

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE