వేసవి సెలవులనగానే  పిల్లలకు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. ఉదయాన్నే లేవాల్సిన పనిలేదు. మామిడి పళ్ళు , తాటి ముంజలు తింటూ ఆడుకోవటం, విహారయాత్రలకు పోవటం, బంధువుల, స్నేహితుల ఇళ్ళలలో చేరి కాలక్షేపం చేయటం, రోజంతా టీవీలో నచ్చిన కార్టూన్లు, సినిమాలు చూడటం వంటి వ్యాపకాలతో పిల్లలు బిజీగా ఉండే రోజులివి. ఏడాది పొడవునా హోం వర్క్, పరీక్షలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపే పిల్లలకు ఈ రెండు నెలలూ చక్కని ఆటవిడుపు సమయం.  మరోమాటలో చెప్పాలంటే పిల్లలు తమకు నచ్చినట్లు గడిపే కాలం. అయితే..ఈ సెలవుల్లో  స్వేఛ్చ పేరుతొ పిల్లలను మరీ వదిలేయకుండా వారి ఆరోగ్యం, బాగోగుల మీదా పెద్దలు కాస్త దృష్టి సారించాలి. పిల్లలకు ఇష్టమైన, ఆసక్తిని కలిగించే వ్యాపకాల మీద వారు  దృష్టి సారించేలా చేయాలి. కోసం ఈ సమయాన్ని వినియోగించుకునేలా చేయగలిగితే  ఆనందం బాటు బోలెడంత పరిజ్ఞానాన్ని కూడా వారు సొంతం చేసుకునేందుకు దోహదపడినట్లవుతుంది.

చిరు కోరికలకు ఓకే

మిగిలిన రోజుల్లో మాదిరిగా కాకుండా  వేసవి సెలవుల్లో పిల్లలను ఓ గంట అదనంగా నిద్ర పోనివ్వండి. ప్రతివిషయంలోనూ టైం టైం అంటూ వారిని కంగారు పెట్టొద్దు. సాయంత్రం పార్కుకో, బజారుకో తీసుకెళ్ళి ఐస్ క్రీం తినిపించటం, సినిమాకో , ఎగ్జిబిషన్ కో తీసుకుపోవాలి. 

వ్యాయామం చేయించండి

సుమారు 2 నెలల పాటు ఉండే వేసవి సెలవుల్లో పిల్లలు భోజనం కంటే చిరుతిళ్ళ వైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు. దీనికి జంక్ ఫుడ్ కూడా తోడై బరువు పెరిగేందుకు దోహద పడుతుంది. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం పిల్లలను మైదానంలో ఏదైనా వారికి నచ్చిన వ్యాయామం చేయించటం మంచిది. ఈత, సైక్లింగ్, హాకీ వంటి ఆటలు ఆడినా బోలెడంత వ్యాయామం చేసినట్లే.  రోజులో కనీసం 40 నిమిషాల పాటు ఏదోఒక రూపంలో శారీరక శ్రమ ఉంటే  చాలు. దీనివల్ల సెలవుల తర్వాత కూడా పిల్లలు ఈ వ్యాయామ సాధనను అలవాటుగా కొనసాగిస్తారు. 

టిఫిన్ బాక్స్ అవసరం

తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైనప్పుడు మధ్యాహ్న భోజనం, చిరుతిళ్ళు వంటివి బాక్స్ రూపంలో రెడీ చేసి వెళ్ళటం అవసరం. లేకపోతె పిల్లలు అల్పాహారం చేసి ఆటపాటల్లో పడి  భోజనం చేయరు. తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్ళిన తర్వాత కూడా ఓసారి ఫోన్ చేసి వారు తిన్నారా లేదా అని వాకబు చేయాలి.

క్రమశిక్షణ

వేసవి సెలవుల్లో పిల్లలు రాత్రిపూట ఎక్కువ సేపు టీవీ చూసేందుకు, సెకండ్ షోలు చూసేందుకు,  స్నేహితుల ఇళ్ళల్లో కాలక్షేపం చేసేందుకు ఇష్టపడతారు. ఇది పద్దతి ప్రకారం ఉంటే  పర్వాలేదు గానీ రోజూ ఇదేపనైతే  నిద్ర చాలక వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలు వారంలో  ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమే ఇలా అనుమతి ఇవ్వటం మంచిది. వారంతట వారే అన్ని పనులు క్రమబద్దంగా చేసుకునేలా వారికి సూచనలివ్వటం వల్ల చక్కని క్రమశిక్షణ అలవడుతుంది.

ఆటపాటలు

ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకోవటం, పాడటం, కొత్త పుస్తకాలు చదవటం, తోట పని  వంటి అంశాల మీద పిల్లలకు అవగాహన కల్పించండి. ఈ అంశాలపై వారికి ఆసక్తి ఉన్నా సమయాభావం వల్ల చేసే వీలండదు గనుక వేసవి సెలవులే ఇందుకు సరైన సమయం. ఈ వ్యాపకాల వల్ల  పిల్లలకు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. పదిమందిలో కలిసేందుకు భయపడటం వంటి సమస్యలూ దూరమవుతాయి.

స్నేహితులకు విందు

మీ పిల్లల స్నేహితులందరినీ భోజనానికి ఆహ్వానించి వారికి ఇష్టమైన పదార్థాలు వండి వారినే వడ్డించుకొని తినమనండి. సినిమా హాల్ దగ్గర వదిలిపెట్టి సినిమా ముగిసే వేళకు వెళ్లి తీసుకురండి. అర్థరాత్రి వేళ వారికి ఇష్టమైన వంటలు వండి వేడి వేడిగా అందించి ఆశ్చర్యపరచండి.

వారాంతపు షికారు

గతంలో వెళ్ళని ఏదైనా కొత్త ప్రదేశాలకు పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఇలాంటి ప్రయాణాలు పిల్లలకు  విజ్ఞానాన్ని, వినోదాన్నీ అందించటమే గాక మరచిపోలేని తీపి గుర్తులుగా నిలిచిపోతాయి. 

 

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE