తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో కపిలతీర్థం ఒకటి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం ఒక విశేషం. హరిహరులకు ఏ భేదం లేదని నిరూపిస్తూ నిలిచిన ఈ తీర్థరాజం తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది. శేషాచల పర్వత పాదాన ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

 

కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపం ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుంచి పుడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థలపురాణం చెబుతోంది. కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన  స్వామిని కపిలేశ్వరుడుగానూ,  ఇక్కడి లింగాన్ని కపిల లింగంగానూ పిలుస్తారు. కామాక్షీ సమేతుడై నిలిచిన స్వామిని తర్వాతికాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణాన ఇక్కడి లింగాన్ని అగ్నిలింగంగానూ వ్యవహరిస్తారు. తిరుమల గిరుల నుంచి గలగలా ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు పాతిక అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగ శివుని జటాజూటాన్ని చేరినట్లు అనిపిస్తుంది. ఇక్కడి పుష్కరిణినే శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ,  చక్ర తీర్థమనీ పిలుస్తారు.  

ఆలయ ప్రత్యేకతలు

ఇప్పుడున్న ఆలయ నిర్మాణం సుమారు వెయ్యేళ్ళ నాటిదని చెబుతారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ఏలిన రాజేంద్ర చోళుని కాలంలో ఈ నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అభిప్రాయం. స్వతహాగా శైవ మతాయులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆళ్వార్ తీర్థమని పిలవటం ఆరంభించారు.  ఇప్పటి ఆలయానికి ముందున్న ఒక చిన్న గుడి, ఆళ్వారులలో ఒకరైన నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెబుతారు. విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడినుంచి వచ్చి ఈ ప్రాంతాన నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ట గావించిందని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితోపాటు కార్తికేయుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు కూడా కొలువై ఉన్నారు. సంతతి లేనివారు ఈ క్షేత్రాన  స్వామిని ఆరాధించి, ఒక రాత్రి నిదుర చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

క్షేత్ర ప్రాశస్త్యం

ఇక్కడి తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. విశేషించి కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వేకువ జామునుంచే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు. కార్తీకమాసం లో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున స్వామివారికి అత్యంత ఘనంగా నిర్వహించే  మారేడు దళాల పూజ, అన్నాభిషేకం చూసి తీరవలసినదే తప్ప ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేము. ఇక్కడ మహా శివరాత్రికి ముందు జరిగే బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ మాసంలో జరిగే తెప్పోత్సవాలు భక్తులను అలౌకిక ఆనందంలో ముంచివేస్తాయి.

ఎలా వెళ్ళాలి?

తిరుపతి పట్టణ ప్రధాన బస్టాండు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో అలిపిరి మార్గంలో ఉన్న కపిలతీర్థానికి చక్కని రవాణా సౌకర్యం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున  బస్టాండు, రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతీ అరగంటకూ నడిచే ఉచిత బస్సుల ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు. లెక్కకు మించి ప్రైవేటు వాహనాలు, ఆటోలూ ఉంటాయి. మదనపల్లి, చిత్తూరుల నుంచి తిరుపతి వచ్చే బస్సులు ఈ ఆలయం మీదుగానే వెళ్తాయి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE