ఏనుగుమల్లమ్మ కొండలు అంటే చాలామందికి తెలియదేమోగానీ హార్సిలీ హిల్స్ అంటే మాత్రం తెలియనివారుండరు. దక్షిణ భారతాన ఉన్న అతి కొద్ది వేసవి విడిది కేంద్రాల్లో ఇదీ ఒకటి. స్వచ్చమైన గాలి, అలా పలకరించి పోతుండే పిల్లగాలులు, కనుచూపుమేర పరచుకున్న పచ్చని ప్రకృతి, గంభీరంగా నిలిచి ఉండే తూర్పుకనుమలు, కొండల మలుపుల్లో అలా కనిపించి ఇలా మాయమయ్యే వన్యప్రాణులు, అడవినే నమ్ముకొని బతికే  చెంచులు.. ఇవీ హార్సిలీ హిల్స్ అంతటా కనిపించే దృశ్యాలు, ఎదురయ్యే అనుభూతులు. ఒత్తిడితో కూడిన జీవన శైలికి అలవాటుపడిన నగర వాసులకు ఊహించనంత ఆహ్లాదాన్నిఅందించే    వేసవి విడిది ఇది. వేసవి సెలవులలో విహార యాత్ర అనగానే చాలామంది ఊటీ, కొడైకెనాల్ అంటారుగానీ ఈ 'ఆంధ్రా ఊటీ' గురించి మాత్రం మరచిపోతారు. ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు, వన్యప్రాణి ప్రేమికులను అబ్బురపరచే దృశ్యాలతో యువతను ఈ ఆంధ్రా ఊటీ  విశేషంగా ఆకర్షిస్తోంది.

ఈ పర్యాటక ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తూర్పు కనుమల పాదాల్లో నెలకొని ఉన్న హార్సిలీ హిల్స్ సముద్రమట్టానికి సుమారు 1265 అడుగుల ఎత్తులో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ఎత్తైన వేసవి విడిది కేంద్రం ఇదే. పేరుకు రాయలసీమలో ఉన్నా మచ్చుకైనా ఆ ప్రాంతంలో కనిపించే ఎండ, ఉక్కపోతలు మచ్చుకైనా కనిపించవు. వేసవిలో 30 డిగ్రీలు, శీతాకాలంలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రదేశం కేవలం వేసవి విడిది గానే గాక ప్రకృతి ప్రేమికుల స్వర్గధామంగా పేరొందింది.

చరిత్ర

ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు ఏనుగుమల్లమ్మకొండ అని పిలిచేవారు. మూడు దశాబ్దాల క్రితం  మల్లమ్మ అనే దైవాంశ గల బాలికను ఏనుగులే పెంచిపెద్ద చేశాయనీ, ఈ ప్రాంతమంతా తిరుగుతూ అక్కడివారిని పలు ఇక్కట్లనుంచి ఆమె కాపాదేదనీ చెబుతారు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరాన ఆమె ఆలయం ఉంది. బ్రిటిష్ వారికాలంలో కడప జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి అప్పటి కలెక్టర్ డబ్ల్యు. హెచ్. హార్సిలీ (1863 - 1867) విహార యాత్రకు రావటం, బాగా బాగా మండే కడప వాతావరణానికి భిన్నంగా ఇక్కడ కాదు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో అప్పటినుంచి తరచూ ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకునేవాడట. ఆయనే తర్వాతి రోజుల్లో ఆంగ్లేయుల నిర్మాణ శైలిలో ఇప్పటి ఫారెస్ట్ బంగాళా నిర్మించి ఇక్కడినుంచే అధికారిక కార్యక్రమాలను నిర్వహించటం మొదలుపెట్టాడు. అప్పటివరకూ ఏ గుర్తింపూ లేని ఈ ప్రాంతం హార్సిలీ రాకతో ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి రావటంతో ఈ ప్రాంతానికి  హార్సిలీ హిల్స్ అనే పేరు స్థిరపడిపోయింది.

అప్పట్లో బంగాళా నిర్మాణానికి బ్రిటన్ నుంచి కలప, టైల్స్ తెప్పించి వాడటం విశేషం. ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా, వినియోగంలో ఉండటం మరో విశేషం. ఫారెస్ట్ బంగాళాకు అనుబంధంగా నిర్మించిన పలు భవనాలూ నేటికీ వినియోగంలో ఉన్నాయి.

పులకింపజేసే ప్రకృతి

ఈ వేసవి విడిది కేంద్రం మదనపల్లెకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదనపల్లె నుంచి హార్సిలీ హిల్స్ మార్గం పొడవునా నీలగిరి చెట్లు  నిటారుగా పెరిగి, ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తాయి. విశాలమైన పచ్చిక బయళ్ళు, పలు పూల మొక్కలు మరీ ముఖ్యంగా సంపెంగ పూల వాసనతో   దారంతా గుబాళిస్తుంది. పెద్ద పెద్ద కాఫీ తోటలతో బాటు యెర్ర చందనం వృక్షాలు, సిల్వర్ ఓక్, యూకలిప్టస్, ఉసిరి, గంధపు చెట్ల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఎన్నెన్నో అరుదైన ఔషధ మొక్కలకు ఈ ప్రదేశం ఆలవాలంగా ఉంది.

చూడాల్సిన ప్రదేశాలు

  • ఇక్కడ చూడాల్సిన వాటిలో రిషి వేలీ స్కూల్ ఒకటి. ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణ మూర్తి స్థాపించి, నిర్వహించిన విద్యాలయం ఇది. ఇక్కడి విద్యా విధానం, సువిశాలమైన ప్రాంగణం, అక్కడ కనిపించే అన్ని రాష్ట్రాల విద్యార్థులు మన దేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎందరో మేధావులు ఇక్కడ విద్యాభ్యాసం చేసారు. మన జాతీయ గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన స్వరరచన చేసిన రాతప్రతి ఇప్పటికీ మదనపల్లె లోని దియోసాఫికల్ కళాశాలలో భద్రంగా ఉంది.
  • ఈ ఈ సీ అని పిలిచే ఇక్కడి పర్యావరణ పార్కు దట్టమైన వృక్షాలతో జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ కేంద్రం విశేషాలను వివరించే ఆడియో వీడియో కేంద్రం, గ్రంధాలయం, ఇక్కడే ఉన్న మొసళ్ళ మడుగు, చిన్న జంతు ప్రదర్శన శాల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఈ పార్కులోని మానస సరోవరం అనే సరస్సు, హార్సిలీ హిల్స్ దారిలోని గంగోత్రి అనే కాలువ ఎప్పుడూ నిండుగా వుంటాయి.
  • హార్సిలీ హిల్స్ కు 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌండిన్య వన్యప్రాణి సంరక్షణా కేంద్రం లో కనిపించే ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, నాలుగు కొమ్ముల జింకలు, కణుజులు, అడవి పందులు, అడవి పిల్లులు, నక్కలు, లెక్కకు మించి రంగుల్లో ఉండే అడవి కోళ్ళు, పక్షులు చిన్నారులను మరోలోకానికి తీసుకుపోతాయి.
  • నాటి కలెక్టర్ హార్సిలీ స్వయంగా నాటిన కల్యాణి అనే పేరున్న 150 ఏళ్ళ యూకలిప్టస్ వృక్షం చూపరులను అబ్బురపరుస్తుంది.
  • పర్వత శ్రేణిలో భాగంగా ఉన్న ఒక అతి పెద్ద రాయి పర్వత పాదం వరకు వేల అడుగుల మేర విస్తరించి ఉండే ప్రాంతాన్నే గాలి బండ అంటారు. పర్యాటకులు అంత ఎత్తునుంచి కనుచూపు మేర కనిపించే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. దూరం నుంచి వేగంగా వీచే గాలులు పర్యాటకులను తాకుతూ వెళ్ళటం మాటల్లో వర్ణించలేని అనుభవమే. 
  • లోయల అందాల్ని స్పష్టంగా చూడాలంటే ఇక్కడి వ్యూ పాయింట్ వద్దకు వెళ్ళాల్సిందే. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం వేళకు పర్యాటకులంతా ఇక్కడికి చేరి ఆ అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించేందుకు పోటీపడతారు.
  • ఇక్కడి శాంతిగిరి ఆశ్రమం అసలైన ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. ఇందులోని కేరళ ఆయుర్వేద కేంద్రంలో పలు చికిత్సలు అందుబాటులో ఉంటాయి.
  • ఇక్కడికి 75 కిలోమీటర్ల దూరాన ఉన్న తిమ్మమ్మ మాను పర్యాటకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. గిన్నిస్ బుక్ రికార్డు సాధించి, సుమారు 8 ఎకరాల మేర విస్తరించిన ఈ మాను వద్ద ఉన్న ఆలయాన్ని దర్శించిన వారికి తప్పక సంతానం కలుగుతుందని స్థానికుల విశ్వాసం.
  • కనీసం 10 మంది, అంతకంటే ఎక్కువ యువ సభ్యులున్న బృందాల కోసం పర్యాటక శాఖ వారు నిర్వహించే ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలు మరచిపోలేని అనుభూతినిస్తాయి. విలు విద్య సాధనకు, ఈత కొట్టాలనే వారికీ తగిన ఏర్పాట్లున్నాయి. అన్ని సౌకర్యాలున్న ఓ రెస్టారెంట్, ఓ చక్కని సమావేశ మందిరం కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి?

హార్సిలీ హిల్స్ వెళ్లాలనుకునే వారికి తిరుపతి నుంచి నేరుగా బసు సౌకర్యం ఉంది. కడప, అనంతపురం, కర్నూలు, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు నడుపుతోంది. మదనపల్లె నుంచి  హార్సిలీ హిల్స్ ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. కుటుంబంతో కలిసి ఆగుతూ చూస్తూ వెళ్లాలనుకునే వారికి  బోలెడన్ని ప్రైవేటు వాహనాలు కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి.  రైలు మార్గంలో వెళ్లాలనుకునే వారికి పాకాల- ధర్మవరం మార్గంలో వెళ్ళే రైళ్ళలో మదనపల్లె చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళాలి. అయితే ఈ మార్గంలో తగినన్ని రైళ్ళు లేవు. విమాన ప్రయాణీకులు బెంగళూరు లేదా తిరుపతి చేరుకొని అక్కడినుంచి రోడ్డుమార్గంలో చేరుకోవాలి.

ఎక్కడినుంచి ఎంత దూరం

మదనపల్లె - 40 కి. మీ

హైదరాబాద్ - 524 కి. మీ

తిరుపతి - 123  కి. మీ

కడప - 125 కి. మీ

బెంగళూరు - 140 కి. మీ 

వసతి సౌకర్యం

ఏపీ టూరిజం వారి కాటేజ్, మరెన్నో ఇతర  వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. ఏపీ టూరిజం వారి వసతి కోసం 09440272241, 09951611040 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏటీయం  సౌకర్యం లేనందున పర్యాటకులు మదనపల్లె లోనే తీసుకోవటం మంచిది. బృందాలుగా వెళ్లేవారికి పలు పాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకాలస్యం? ఈ వేసవి సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి హార్సిలీ హిల్స్ చుట్టేసిరండి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE