మనదేశంలో సనాతన ధర్మానికి, ఆరాధనకు ఆలయాలు ప్రధాన నెలవులు. ఇవి కేవలం ధార్మిక అంశాలకే పరిమితమైనవిగా  గాక ఆయా ప్రాంతపు సంగీతం, సాహిత్యము, నృత్యము వంటి కళలు, అక్కడి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం వంటి పలు అంశాలను ప్రతిబింబిస్తాయి. ఆలయ నిర్మాణ శైలిని గమనించినప్పుడు  ఆయా ప్రాంతాలను పాలించిన రాజుల అభిరుచి, ఆయా కళల పట్ల వారికున్న అవగాహన స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడా లేనట్లు మన దేశంలో ఆలయ నిర్మాణం  వాస్తు,  శిల్ప, ఆగమ శాస్త్రాలు నిర్దేశించిన రీతిలో ఉంటుంది. బహుశా అందుకే మన వాస్తు శిల్పం సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా నిలవగలిగింది. అలాంటి అద్భుత శిల్ప, వాస్తు సౌందర్యాల అసలు సిసలు చిరునామాగా దక్షిణాదిలోని బృహదీశ్వరాలయం నిలుస్తుంది. 1954లో మొట్టమొదటిసారిగా చలామణిలోకి వచ్చిన రూ.1000 నోటు మీద నాటి భారత ప్రభుత్వం బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. ఆలయ సహస్రాబ్ది ఉత్సవాలకు తపాలాశాఖ ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

ఈ ఆలయం తమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్నతంజావూరులో ఉంది. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రంగా విలసిల్లింది. సంగీత, నాట్య, చిత్రలేఖనాలకు సంబంధించి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పట్టణమిది. నాటి చోళ సామ్రాజ్యం నేటి తమిళనాడు,  కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల వరకూ, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు,పలు దక్షిణాసియా ద్వీపాలవరకూ  మొదలైన ద్వీపాల వరకూ విస్తరించి ఉంది. రాష్ట్ర కూటుల నాటికే ఆలయ నిర్మాణం ఊపందుకోగా వారి తర్వ్వతి పాలకులైన చోళుల కాలంలో ఈ వైభవం తారస్థాయికి చేరింది.

ఆలయ వైభవం

బృహదీశ్వరాలయానికి మూడు ప్రధాన ద్వారాలుంటాయి. వాటిలో మొదటి ద్వారం పేరు కేరళాంతకన్‌. రెండో ద్వారం పేరు రాజరాజన్‌ తిరువసల్‌.  మూడో ద్వారం తిరువానుక్కన్‌ తిరువసల్‌. ఈ మూడు ద్వారాలు దాటుకొని లోనికి ప్రవేశించగానే 5 పడగల నీడన గంభీరంగా ఉండే 13 అడుగుల బ్రహ్మాండమైన శివలింగం కనిపిస్తుంది. ఇంత పెద్ద లింగం దక్షిణ భారతదేశంలో లేదనిపిస్తుంది. తూర్పు దిశగా ముఖద్వారం ఉన్న ఈ ఆలయానికి మిగిలిన మూడు దిక్కులా నుంచీ ప్రవేశ ద్వారాలున్నాయి. లెక్కకు మించిన శాసనాలు, కళ్ళు చెదిరే శిల్పకళావైభవంతో చూపరులను ఆకట్టుకొనే ఈ ఆలయాన్ని క్రీ. శ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు.  ఈ దేవాలయ దక్షిణ విమాన గోపురం నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల  కళావైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగా శంకరుని వైపే దృష్టి సారించిన  భారీ నంది విగ్రహం ఏంతో  ముచ్చటగా ఉంటుంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో చిత్రించిన ఎన్నో లతలు, సన్నివేశాలు ఈ నాటికీ చెక్కుచెదరకుండా అలరిస్తాయి.

 

ఉపాలయాలు

 ఆలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా నిలిచి వుండే శివ, నటరాజ, దేవీ దేవతామూర్తుల గురించి యెంత చెప్పినా తక్కువే. ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి, ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి. నాయక రాజుల కాలంలో నిర్మితమైన ఇక్కడి సుబ్రహ్మణ్య ఆలయ నిర్మాణ వైభవం చూసి తీరాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేము. 

ఇతర చూడదగిన ప్రదేశాలు

తంజావూరులోని మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు దీన్ని గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, శత్రు దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.

విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌

పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.

త్యాగరాజస్వామి సమాధి

తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న తిరువయ్యూరు  గ్రామంలోనే ప్రఖ్యాత  తెలుగు వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉంది. ఏటా ఇక్కడ జరిగే త్యాగరాజస్వామివారి ఆరాధన ఉత్సవాలలకు  ప్రపంచం నలుమూలల నుంచీ సంగీత విద్వాంసులు హాజరై స్వామివారికి స్వరార్చన చేసే ఘట్టం  భాషకు అందని అనుభూతి.

ఎలా వెళ్ళాలి?

 చెన్నైవరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE