జైనం, బౌద్ధం గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా  మహారాష్ట్రలో ఉన్న ఎల్లోరా గుహల ప్రస్తావన రాకమానదు. దుర్భేద్యమైన సహ్యాద్రి పర్వత సానువులను తొలిచి అందులో భాగంగానే నిర్మించిన కన్ను చెదిరే గుహాలయాలు, చైత్యాలు, ఆరామాలు, అక్కడి శిల్ప సంపద  గురించి మాటల్లో వర్ణించలేము.  ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి  సజీవ సాక్షాలుగా నిలిచిన ఇక్కడి  శిల్పాలు, అద్భుతమైన నిర్మాణ శైలి ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపు పొందాయి. వెరూల్ పేరిట చరిత్రలో పేరొందిన ఎల్లోరా గ్రామం ప్రాచీన వాణిజ్యకేంద్రంగా పేరు పొం దింది. అరబ్‌, యూరప్‌ ప్రాంతాల వర్తకులు ఈ గ్రామంలో తయారైన వస్తువులను కొనుగోలు చేసేవారట. సముద్రం ఒడ్డున తడి ఇసుకతో చిన్నారులు నిర్మించే బుల్లి బుల్లి గూళ్ళ సూత్రం ఆధారంగానే ఇక్కడి కొండలను తొలిచి గుహాలయాలు నిర్మించారాణి తెలిస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే. హైదరాబాద్‌ నుండి మన్మాడ్ రైలు మార్గంలోని ఔరంగాబాద్‌ స్టేషన్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఈ గుహాలయాలు నెలకొని ఉన్నాయి.

 ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ఎల్లోరా గుహలు దాదాపు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో, 34 గుహలుగా  వ్యాపించి ఉన్నాయి.  హిందూ, జైన, బౌద్ద మత సంస్కృతులకు గుర్తుగా ఉండే ఎల్లోరా ప్రాంతపు పర్వత శ్రేణుల్లో నదీ నదాల మధ్య అలరారే ప్రకృతి గురించి మాటల్లో వర్ణించలేము. కొన్ని వందల ఏళ్ళుగా ఎల్లోరా గుహాలయాలు నిత్యనూతన శోభలతో పర్యాటకుల మది దోచుకుంటూనే వున్నాయి. ప్రపంచపు నలుమూలల నుంచి రోజూ వేలాది మంది పరిశోధకులు, యాత్రీకులు, కళాప్రియులు ఆ విలువైన అందాలను ఆస్వాదించడానికి వస్తుంటారు.

గుహలు.. వివరాలు

వీటిలో మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటిని 5-8 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. ఈ గుహల్లో ఎక్కువ భాగం బౌద్ధ భిక్షువుల ధ్యానాది సాధనలు, విద్య గడపడానికి దూర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి విడిదిగా వాడేవారట. ఈ గుహలలో కొన్ని రెండు, మూడు అంతస్తులుగా ఉండి, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా నిర్మించారు. ఎల్లోరా గుహల వరుసలో తొలిగుహ అత్యంత ప్రాచీనమైనది. రెండో గుహలో బుద్ధుడి విగ్రహాలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ గురువైన బోధిసత్వుని విగ్రహాలున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహపు అందం చూపరులను ఆకట్టుకుంటుంది. మిగతా గుహల విషయానికొస్తే 10వ గుహ అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడి బౌద్ధ గుహాలయాలన్నింటికీ ఇది మకుటాయ మానమని చెప్పాలి. ఈ గుహాలయాన్నివిశ్వకర్మ గుహ అంటారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన వేలాది పరివారం సాయంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. ఇక్కడ శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఉన్న బుద్ధుని మూర్తి ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈగుహలో ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ధ్వని తరంగాలు కొంచెం కొంచెం తగ్గుతూ గమ్మతైన ధ్వనితో ముగుస్తాయి.

13 నుంచి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు , పౌరాణిక గాధలను తెలుపుతాయి. ఇవి 6-8 శతాబ్దాల మధ్య కాలంలో తొలిచారు. 14వ గుహలో రావణుడు పొందిన పరాభవ ఘట్టాన్ని ఆవిష్కరించే శిల్పం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. పదహారవ గుహలోని కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. దాదాపు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి రెండువైపులా రెండంతస్థుల నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే ద్వజస్తంభం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణానికి 150 సంవత్సరాల సమయం పట్టగా, ఆలయ నిర్మాణ పనుల్లో సుమారు 7 వేలమంది పాల్గొన్నారట.  రామాయణ, మహాభారత గాధల విశేషాలను శిల్పాలుగా మలచిన తీరు అద్భుతం. ఈ ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఉండటం విశేషం. 21వ గుహను రామేశ్వర గుహాలయం అనీ, 22వ గుహ నీలకంఠగుహ అనీ పిలుస్తారు. 25వ గుహలో ఏడుగుర్రాలు పూన్చిన రథం మీద సూర్యుడున్న శిల్పం, 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తే శిల్పాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. .

30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటిని 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కారు. 30 నుంచి 34 వరకు ఉండే గుహలు జైనులవి. ఇక్కడి 32వ గుహలో గోమటేశ్వరుడి విగ్రహం అందం గురించి మాటల్లో చెప్పలేము. ఈ గుహలన్నీ క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కారు.

సూచనలు

ఎల్లోరా గుహాలయాలకు ప్రతి మంగళవారం సెలవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఉదయం 9. గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుహలు తెరచి ఉంటాయి. అన్ని జాతీయ సెలవుదినాల్లోనూ వీటిని తెరచి ఉంచుతారు. ఔరంగాబాద్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి నుంచి షిరిడి కేవలం 98 కిలోమీటర్లే. ఎల్లోరా గుహలకు సమీపంలోని జ్యోతిర్లింగ క్షేత్రమైన ఘృష్ణేశ్వరంలో కొలువై ఉన్న ఘృష్ణేశ్వరుడిని కూడా యాత్రికులు దర్శించుకుంటారు. ఎల్లోరా గుహలతో బాటు అక్కడి ప్రక్రుతి రమణీయతను ఆస్వాదించాలనుకుంటే ఆగస్టు- డిసెంబర్ మాసాలు అనుకూలమైన సమయం. వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి వెళ్లాలనుకునే వారూ ఎలాంటి ఇబ్బడి లేకుండా ఇక్కడి అందాలను చూసిరావచ్చు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE