ఆకాశాన్నంటాయా అన్నట్టుండే పర్వత సానువులు, పాతాళాన్ని తలపించే చీకటి లోయలు, చేయి ఎత్తితే అందేంత సమీపాన సాగిపోయే చల్లని మేఘాలు, తరచూ పలకరించే చిరు జల్లులు, కనుచూపు మేర పరచుకొని ఉండే పచ్చిక బయళ్ళ సోయగాలు, ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయాలకు ప్రాణమిచ్చే నాగా సమాజం ..ఇవన్నీ చూడాలనుకునే వారంతా తప్పక నాగాలాండ్  వెళ్ళాల్సిందే. ఈ బుల్లి ఈశాన్య భారత రాష్ట్రం ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకొనే  పర్యాటకులకు, సాహసక్రీడలను ఇష్టపడే వారికి ఇది స్వర్గధామం. ఆసియా ఖండపు స్విట్జర్లాండ్ గా పేరున్న నాగాలాండ్ రాష్ట్రంలో నూటికి 90 శాతం ప్రజలు క్రైస్తవులు కాగా వారి అధికారిక భాష ఇంగ్లిష్ కావటం విశేషం. 

 

అటు బర్మా, ఇటు టిబెట్ ప్రాంతానికి చెందిన లెక్కకు మించిన గిరిజన జాతుల చిరునామా నాగాలాండ్‌.  మనదేశంలో ఇంగ్లిష్ అధికార భాషగా ఉన్న ఏకైక రాష్ట్రమూ ఇదే. ఇప్పటికీ చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరిగే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలుగా కనిపిస్తారు. చిత్ర విచిత్ర వేషధారణలతో.. తమ విభిన్నమైన సంసృతిని చాటే నాగా ప్రజల సహజ జీవన శైలి  పర్యాటకులను అబ్బురపరుస్తుంది. నాగాలాండ్ రాజధాని కొహిమా. సముద్రమట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ సైన్యం ఈ పట్టణాన్ని ఆక్రమించి, అక్కడే బసచేశాయి. ఆ యుద్దంలో అమరులైన సైనికుల గుర్తుగా నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకుల చేత  కంటతడి పెట్టిస్తుంది.

చూడదగ్గ ప్రదేశాలు

  • నాగాలాండ్ వెళ్ళే పర్యాటకులు తప్పక చూడాల్సిన ప్రదేశాలలో స్టేట్ మ్యూజియం ఒకటి. నాగా ప్రజల జీవన శైలి, వారి ఘనమైన చరిత్రనూ కళ్ళకు కట్టినట్టు చూపే ఇక్కడి విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలు పర్యాటకులను చూపు తిప్పుకోనివ్వవు. నాటి కాలంలో వేడుకల సమయంలో వాడిన బ్రహ్మాండమైన ఒక డప్పువాయిద్యం ఔరా అనిపిస్తుంది. దేశంలో మరెక్కడా కనిపించని లెక్కకు మించిన అరుదైన పక్షులు.. ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక హాలులో కనువిందు చేస్తాయి.
  • కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న పెద్ద కేథలిక్‌ చర్చిలో దేశంలోనే అతిపెద్ద శిలువ ఉంది. చెక్కతో మలచిన అపురూపమైన ఆ శిలువ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.
  • నాగాలాండ్‌కు రాజధాని కోహిమానే అయినా.. వాణిజ్య రాజధాని మాత్రం దిమాపూర్‌. కోహిమాకు 75 కిలోమీటర్ల దూరాన ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాలైన మణిపూర్‌, అసోం , అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు ఈ పట్టణం దగ్గరగా ఉండటంతో ఇది వాణిజ్య ప్రాంతంగా అభివృధ్హి చెందింది. రాష్ట్రంలోని ఏకైక విమానాశ్రయం కూడా దిమాపూర్‌లో ఉంది. దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపించే నాటి కచారి రాజుల కాలం నాటి కట్టడాలు ప్రత్యెక ఆకర్షణగా ఉంటాయి.  దిమాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుజాఫెమా వద్ద పలు గిరిజన ఉత్పత్తులు లభిస్తాయి.
  • కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖొనోమా గ్రామం  ప్రకృతి రమణీయతకు అసలైన చిరునామా. ఆహ్లాదకరమైన గ్రామ పరిసరాలను యాత్రికులు తన్మయత్వంతో చూసి పులకించి పోతారు. పచ్చటి వరి పొలాలతో కనువిందు చేసే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఈ బుల్లి గ్రామంలో సేంద్రియ వ్యవసాయ పద్దతిలో సుమారు పాతిక రకాల వారి వంగడాలను పండిస్తారు. 
  • ఇక.. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతోనూ, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతోనూ లోయ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • కోహిమా నగరం నడిబొడ్డున ఉండే బస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న సేల్స్‌ ఎంపోరియంలో రంగురంగుల శాలువాలు, చేతిసంచీలు, చెక్కతో మలచిన బొమ్మలు, వెదురుబుట్టల వంటి పలు ఉత్పత్తులు దొరుకుతాయి.

 

ఇలా వెళ్లాలి...

విమాన మార్గంలో వెళ్ళేవారు ముందుగా దిమాపూర్‌  విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరాన ఉన్న కోహిమాకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. కోల్‌కతా, గౌహతి నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. ఉత్తరభారతంలోని పలు ప్రాంతాల నుంచి దీమాపూర్ కు రైలులో చేరుకొని అక్కడి నుంచి కూడా కొహిమా చేరుకోవచ్చు. దిమాపూర్‌ నుంచి కోహిమాకు బోలెడు ప్రైవేటు వాహనాలున్నాయి.  గౌహతి, షిల్లాంగ్‌, కోహిమా నుంచి నేరుగా బస్సు సౌకర్యం ఉన్నది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE