ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తలకోన జలపాతం ప్రముఖ పర్యాటక కేంద్రం. ఇంకా చెప్పాలంటే ప్రకృతి ప్రేమికుల స్వర్గం. ఒకప్పుడు తెలుగునాట సినిమా షూటింగులకు ఇది చిరునామాగా ఉంది. ఇక్కడ చిత్రీకరించిన సినిమాలు తప్పక విజయవంతం అవుతాయని ఒక నమ్మకం కూడా అప్పట్లో ఉండేది. అయితే పలు కారణాల వల్ల తలకోన అందాలకు తగినంత ప్రచారం లభించలేదనే చెప్పాలి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 45 కిలోమీటర్ల దూరాన ఉన్న తలకోన విశేషాల గురించి తెలుసుకుందాం.

తలకోన విశేషాలు

దట్టమైన నల్లమల అడవి, కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, ఠీవీగా నిలబడి ఉండే ఎత్తైన కొండలు, పక్షుల కిలకిలారావాలు, గుండె ఝల్లుమనే శబ్దంతో  దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం.. . ఇలాంటి ఎన్నో అందాలకు నెలవైన తలకోన నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది.

 వాహనాల్లో వచ్చే పర్యాటకులు తలకోన శివాలయం చేరగానే వాహనాలు పార్కింగ్ చేసి ముందుగా ఇక్కడి శివాలయంలో వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వర, గణేశ, సుబ్రమణ్యస్వామి వార్లను దర్శించుకుంటారు. ఆపై నెమ్మదిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ తలకోన యాత్ర మొదలవుతుంది. అక్కడినుంచి కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు సాగితే అక్కడ రెండు కొండల మధ్య నుంచి జాలువారే బ్రహ్మాండమైన జలపాతం దర్శనమిస్తుంది.  జలపాతం కింద ఉండే పెద్ద బండ రాళ్ళ మీద నిలబడి చేసే స్నానం, జలపాతం దిగువన ఉన్న జలాశయంలో ఈతల అనుభూతులు సరికొత్త అనుభూతినిస్తాయి.

వసతి సౌకర్యాలు, రవాణా 

వాహనాలు పార్కింగ్ చేసే చోట రాష్ట్ర పర్యాటకశాఖ వారి అతిధి గృహం మినహా చెప్పుకోదగ్గ వసతి ఇక్కడ లేదు. ఆలయం వద్ద కనిపించే కొన్ని షాపులు, ఒకటీ ఆరా హోటళ్ల వద్ద యాత్రికులకు కావాల్సిన ఆహారం లభిస్తుంది. సాధారణంగా ఇక్కడకు వచ్చే చాలామంది పర్యాటకులు ఆహార పదార్థాలు వెంట తీసుకువెళ్తారు. లేకపోతే ఆలయం దగ్గరి హోటల్‌లో ముందుగా చెబితే భోజనాన్ని సమకూరుస్తారు.

తిరుపతి నుంచి యెర్రావారిపాలెం చేరుకుని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో నేరుగా తలకోన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. ఇతర ప్రయాణీకులు తిరుపతి నుంచి యెర్రావారిపాలెం వరకు ఆర్టీసీ బస్సులో చేరి అక్కడినుంచి  వ్యాన్, ఆటోలలో తలకోన చేరుకోవచ్చు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE