హిల్ స్టేషన్స్ అనగానే ఎత్తైన కొండలు, లోతైన లోయలు, చల్లని వాతావరణం, కనుచూపు మేర పరుచుకున్న పచ్చని ప్రకృతి, వంపులు తిరుగుతూ ముందుకు దూకే జలపాతాలు తలపుకొచ్చి మనసును గిలిగింతలు పెడతాయి. చాలామందికి కొండప్రాంత పర్యాటక ప్రదేశాలంటే ముందుగా ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, కులు, మనాలి, కాశ్మీర్, డార్జీలింగ్, నైనిటాల్, ముస్సొరి వంటి ప్రదేశాలే గుర్తొస్తాయి. అయితే మనకు దూరాన ఉన్న ఈ పర్యాటక ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని, మనసును దోచుకొనే పర్యాటక ప్రదేశాలు ఆంధ్ర దేశంలోనూ చాలానే ఉన్నాయి. అలాంటివాటిలో విశాఖ జిల్లాలోని అరకు ఒకటి. ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లుగా పేరొందిన 'అరకు' లెక్కలేనన్ని ప్రకృతి అందాలకు , అంతరించిపోతున్న అరుదైన గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. 

తూర్పు కనుమల ఒడిలో ఒద్దికగా ఒదిగిపోయిన అరకులోయ,  విశాఖపట్టణానికి 116 కి.మీ.ల దూరంలో ఉంది. ఏడాది పొడవునా సందర్శించదగిన ప్రదేశమైన అరకు సముద్రమట్టానికి సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒడిశాతో సరిహద్దు పంచుకుంటున్న అరకుకు మరోవైపు జీవ వైవిధ్యంతో కూడిన అనంతగిరి, సున్కరిమెట్ట రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఉంటుంది. ఇక..అరకును చుట్టినట్లు ఉండే రక్త కొండ, గాలికొండ మరియు సుంకరి మెట్ట కొండలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇక్కడి గాలికొండ రాష్ట్రం లోనే అతి పొడవైన కొండ గా చెపుతారు. ప్రకృతి అందాలకే గాక అరుదైన కాఫీ రకాలకూ అరకు అసలైన చిరునామా. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇక్కడి గిరిజన మహిళలు సాగు చేస్తున్న పలు కాఫీ రకాలు అంతర్జాతీయ గుర్తింపును సాధించటం విశేషం.

వాతావరణం

 అందమైన ప్రకృతి, ఆకు పచ్చని కొండలు, చుట్టూ విరబూసిన అవిసె తోటలతో పసుపు రంగు పులుముకున్నట్టుండే లోయల మధ్య మైదాన ప్రాంతం, నేలను ముద్దాడే మంచు మేఘాలు, ఇలా వచ్చి అలా వెళ్లే శీతల పవనాలు, అమాయక గిరిజనుల బతుకు చిత్రాలు .... మనసుకు, శరీరానికి ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. చలి కాస్త ఇబ్బంది పెట్టినా ఈ అందాలను ఆసాంతం ఆస్వాదించాలంటే శీతాకాలంలోనే వెళ్ళాలి. ఇక వేసవిలో వెళితే అక్కడి చల్లని వాతావరణం అక్కడనుంచి కదలనీయదు. ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలను ఇష్టపడే పర్యాటకులకు అరకు మేలైన ఎంపిక. 

ప్రయాణం, వసతి ?

పర్యాటకులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అరకు చేరుకోవచ్చు. అరకు, అరకు వాలీ పేరిట ఇక్కడ 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రెండు స్టేషన్ లు విశాఖతో కలపబడి వున్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కోతవలస…కిరండూల్ రైల్వే లైన్ పై ఉన్న ఈ రెండు స్టేషన్స్ విశాఖతో కలపబడి ఉన్నాయి. ఉదయం 6.50 గంటలకు విశాఖలో బయలుదేరే కిరండొల్ పాసింజర్ ఎక్కితే సుమారు 4 గంటలు ప్రయాణం అనంతరం 10:40 గంటలకు అరకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో వచ్చే 'సిమిలిగుడ' అనే రైల్వే స్టేషన్ భారతదేశంలోని అత్యంత ఎత్తైన బ్రాడ్ గేజ్ స్టేషన్ గా గుర్తింపు పొందింది. అయితే ప్రకృతి అందాలను దగ్గరగా, ఆగుతూ ఆసాంతం చూడాలంటే మాత్రం బస్ లేదా సొంతవాహనాల్లో వెళ్లటమే మంచిది. అరకులో అన్ని తరగతుల వారికి అనువైన వసతి దొరుకుతుంది, 400 నుండి 2500 రూపాయల వరకు అద్దెతో రూములు లభ్యమౌతాయి. అరకు చుట్టుపక్క అందాలు చూడాలంటే అక్కడ టాక్సీ లు, మినీ వేన్ లు లభ్యమౌతాయి, గైడ్ సౌకర్యం కూడా దొరుకుతుంది.

ఇతర విశేషాలు

అరకు నుంచి విశాఖ తిరుగు ప్రయాణంలో రోడ్డుకు ఇరువైపులా ఉండే దట్టమైన అటవీ ప్రాంతం గుండా మెలికలుదిరిగినట్లు ఉండే ఘాట్ రోడ్డు ప్రయాణం చెప్పలేని ఉద్వేగాన్ని కలిగిస్తుంది. ఈ దారిలో అనంతగిరి కొండలలో ఉన్న కాఫీ తోటల పరిమళాలు పర్యాటకులను విశేషంగా అలరింపజేస్తాయి. అరకు లోయకు 29 కి.మీ. దూరములో ఉన్న బొర్రా గుహలు, ఆ పక్కనే ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన కటిక జల పాతం, చాపరాయి జలపాతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అరకు సమీపంలో టైడ గ్రామంలో కొండపై చెక్క, కొయ్యతో చేసిన 'జంగిల్ బెల్స్' కాటేజిల్లో బస చేసినట్లయితే అడవిలో ట్రెక్కింగ్ చేయవచ్చు, పక్షులను తిలకించవచ్చు, గిరిజన సాంప్రదాయ నృత్యాలను వీక్షించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE