చెప్పలేనన్ని అరుదైన వృక్ష జాతులు, జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు, స్వేచ్ఛగా కాలికొద్దీ తిరుగుతూ చెంగుచెంగున ఎగిరే వందలాది జింకలు, ప్రకృతి పులకరింతతో పురివిప్పి ఆడే నెమళ్లు, రంగురంగుల పక్షుల కిలకిల రావాలు..ఇవేవీ సుదూర ప్రాంతప్పు అటవీ అందాలు కావు.భాగ్యనగర శివార్లలో గల మహావీర హరిణ వనస్థలి సొబగులివి. ఉరుకుల, పరుగుల జీవితాలతో విసిగి రవ్వంత ఆహ్లాదాన్ని, ఆటవిడుపునుకోరుకొనే నగరవాసులకు..మరీ ముఖ్యంగా చిన్నారులకు వినోదాన్నీ,విజ్ఞానాన్నీ పంచుతున్న అరుదైన విహారస్థలి ఇది. విజయవాడ వెళ్లే జాతీయ రహదారి మార్గంలోఎల్బీ నగర్‌ సమీపాన గల ఆటోనగర్ వద్ద మొదలయ్యే ఈ వనస్థలి సుమారుగా 3800 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 1994లోప్రముఖ జైన గురువైన మహావీరుని గుర్తుగా దీన్ని మహావీర హరిణ వనస్థలి పేరుతో జాతీయ వనంగా ప్రకటించారు. రోజూ వందలాది మంది నగరవాసులుఈ వనాన్ని దర్శిస్తూ ఉంటారు. వీరిలో చిన్నారులు, విద్యార్థులే ఎక్కువ.

చరిత్ర

ఒకప్పుడు దట్టమైన అడవిగా ఉండే ఈ ప్రాంతానికి నాటి నిజాం పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వేట నిమిత్తం తరచూ వచ్చేవారట. నిజాం కాలంతర్వాత అటవీ శాఖ పరిధిలోకి వచ్చిన ఈ హరిణ వనస్థలిని ప్రజలు దర్శించేందుకు 1975లోనాటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. తొలినాళ్లలో కేవలం 300 ఎకరాల పరిధిలోనే సందర్శకులకు అనుమతి ఉండేది.

ప్రత్యేకతలు

  • ఈ పార్కులో వందలాది కృష్ణ జింకలు, బంగారు జింకలు, 500 నెమళ్లు, 300 కుందేళ్లు, అడవి పందులు, ముంగిసలు, పాములతో పాటు 200 రకాల పక్షులు, వందలాది ఔషధ మొక్కలున్నాయి.
  • ఎన్నో రకాల చిలుకల కొరకు ఏకంగా ప్రత్యేక పార్కు ఉంది. పర్యాటకుల వసతి కోసం పార్కులో వసతి గృహాలు ఉన్నాయి.
  • పార్కు ఆవరణలో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన మ్యూజియం విద్యార్థులను ఎంతగానో అలరిస్తుంది. ఈ మ్యూజియంలో గల నమూనా జంతువుల, పక్షులనమూనాలు పిల్లలకు ఆసక్తినీ, అవగాహనను కలిగిస్తాయి. ఈ మ్యూజియంలో గల చిన్న థియేటర్లో విహారయాత్రలకు వచ్చే పిల్లల కోసంవన్యప్రాణుల జీవితాల గురించిన చిత్రాలను ప్రదర్శిస్తారు.
  • వనస్థలికి ప్రత్యేక ఆకర్షణ సీతాకోకచిలుకల ఉద్యానవనం. వేలాది పూలమొక్కల మధ్య స్వేచ్ఛగా విహరిస్తున్న సీతాకోక చిలుకలను చూడాలంటే రెండుకళ్ళూ చాలవు.
  • సఫారీ పేరిట బస్సులో 3 కిలోమీటర్లమేర తిరుగుతూ దగ్గరినుంచికృష్ణ్ణజింకలతోపాటు దుప్పులు, నెమళ్లు, పాములు, అడవి పందులు, కోతులను చూడటం ఒక అపూర్వమైన అనుభూతి.
  • ఇక్కడ ఉన్న జింకల పార్కు దేశంలోనే అతిపెద్దదిగా పేరుగాంచింది. కార్తీక మాసంలో వనభోజనాల పేరిట సందర్శకులు పెద్ద సంఖ్యలో ఈ జింకల పార్కుకువస్తుంటారు. ఏటా పార్కు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం నిర్వహించే కార్యక్రమంలో చిత్రలేఖనంతో పాటు పలు రకాల పోటీలు ఉంటాయి. ఈ ముగింపు వేడుకలో ఉండే పాముల ప్రదర్శన ఎంతో అలరిస్తుంది.
  • ప్రవేశానికి రూ.10లు, సఫారి ప్రయాణానికి రూ.20 వసూలు చేస్తున్నారు. పార్కు లోపల పిల్లలు ఆడుకోవడానికి పచ్చిక బయళ్లు, కూర్చొనే సౌకర్యం ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం 040-24286523 నంబరులో సంప్రదించవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. మీరూ మీ కుటుంబ సభ్యులతో ఈ వారాంతంలో హరిణవనస్థలి అందాలను ఆస్వాదించి రండి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE