కరువు కాలంలో అన్నార్తులను ఆదుకున్న అక్షయపాత్ర. ఎన్నో నిరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనం. శాంతికీ ..ప్రేమకు చెరగని చిరునామా. ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం. నిర్మించి 90 వసంతాలైనా చెక్కుచెదరని అందాలతో, మెతుకుసీమకు తలమానికంగా భాసిల్లుతోన్న అత్యద్భుత నిర్మాణం. అదే ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా, రెండవ వాటికన్‌గా పేరుగాంచిన మన మెదక్‌ కెథడ్రల్‌ చర్చ్‌.

మెతుకుసీమను బతికించిన నిర్మాణం

మెదక్‌ పట్టణంలోని ఈ పురాతన చర్చ్‌ ఆసియాఖండంలోనే ప్రఖ్యాతి గాంచింది. గోతిక్ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ చర్చ్ నిర్మించిన వ్యక్తి చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌. ఇంగ్లాండ్‌ లో పుట్టి ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షితుడై పాస్టర్‌గా మారి 1895లో మద్రాసు, ఆ తర్వాత సికింద్రాబాద్‌ చేరిన ఫాస్నెట్‌గ్రామీణ ప్రాంతంలో సువార్తను అందించేందుకు 1897లో మెదక్‌ చేరారు. ఇప్పటి చర్చి ఉన్నదగ్గర్లోని పెద్ద భవనంలో ఫాస్నెట్‌ నివాసం ఉండేవారు. ఒక రోజు బంగళాపై పచార్లు చేస్తున్న క్రమంలో తన భవనం కంటే తక్కువ ఎత్తులో ఉన్న చర్చ్ ను చూసి.. ప్రభువు మందిరమైన చర్చి కంటే తాను పెద్ద మేడలో ఉండటాన్ని తప్పుగా భావించి పెద్ద చర్చి నిర్మించాలని సంకల్పించారు. 

అయితే ఆ రోజుల్లో మెదక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. తన చర్చి నిర్మాణంలో ఇక్కడివారిని భాగస్వాములు చేయటం ద్వారా అటు చర్చి నిర్మాణం, ఇటు ఆకలి చావులను నివారించ వచ్చని తలచి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టారు. మొదట్లో చర్చిని 180 అడుగుల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించిన ఫాస్నెట్‌ నిర్మాణ అనుమతి కోసం నిజాంకు దరఖాస్తు చేశారు. అయితే నాటి నిజాం రాజ చిహ్నంగా ఉన్న చార్మినార్ 175 అడుగుల ఎత్తున్న కారణంగా అంతకంటే ఎత్తున్న చర్చ్ నిర్మాణానికి నిజాం సర్కారు అనుమతించలేదు. దీంతో 173 అడుగుల ఎత్తుతో చర్చి నిర్మించేందుకు ఫాస్నెట్‌ నిర్ణయించారు. ముందుగా చర్చి కోసం 1000 ఎకరాల భూమి కొని నిర్మాణ నమూనా కోసం లండన్ వాసి, పాత మిత్రుడైన బ్రాడ్‌షా చేత 200 నమూనాలు తయారు చేయించారు. వాటిలో ఏది ఎంచుకోవాలో తెలియక ఇప్పటి చర్చ్ ఉన్న గుట్ట మీద వాటిని పెట్టి ప్రార్థించగా పెద్ద గాలికి అన్ని కాగితాలు కొట్టుకుపోయి ఒక్క నమూనా మిగిలింది. ఆ నమానానే దేవుని నిర్ణయంగా భావించి చర్చ్ నిర్మాణం ఆరంభించారు. ఈ చర్చ్ నిర్మాణం 1914 నుంచి 1924 వరకు సాగింది.  12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాల పాటు శ్రమించి ఈ అత్యద్భుత కట్టడాన్ని నిర్మించారు. ఇందుకు 14 లక్షల రూపాయలు ఖర్చు కాగా వాటిని ఆయన ఇంగ్లాండ్‌ నుంచే సేకరించారు. అలా ఆయన మహోన్నత ఉద్దేశంతో, శ్రమజీవుల చెమట నుంచి ఈ చర్చ్ ఆవిర్భవించింది.

నిర్మాణ విశేషాలు

  • చర్చి అంతర్భాగం ప్రాచీన రోమ్‌ నిర్మాణ శైలి అయిన గోతిక్‌ శైలిని పోలి ఉంటుంది. విశాలమైన ప్రధాన ప్రార్థనా మందిరం పైకప్పు, ప్రాకారాలు, ప్రధాన వేదిక, ఎత్తైన స్తంభాలు, ప్రవేశ ద్వారాలు వాస్తు శిల్పి థామస్‌ ఎడ్వర్డ్‌ , దేశ, విదేశీ నిర్మాణ రంగ నిపుణుల పర్యవేక్షణలో కళాత్మకంగా నిర్మితమయ్యాయి.
  • చర్చిలోపల నేలపై పరచిన రంగురంగులబండ రాళ్లను ఇంగ్లాండ్‌ నుంచి తెప్పించారు. ఏ కాలంలో అయినా చల్లగా ఉండటం, అడుగుల శబ్దం కూడా రాకపోవడం ఈ రాళ్ల ప్రత్యేకత. చర్చి గోడల మొత్తం గచ్చుపనిని ఇటలీ పనివారు చేశారు. ప్రధాన వేదిక గోడకు అమర్చిన పాలీష్‌ స్టోన్‌ను ఇటలీ నుంచి తెప్పించారు.
  • చర్చి నిర్మాణంలో అద్దాల కిటికీలు మరో ప్రత్యేకత. క్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఎంతో కళాత్మకంగా ఈకిటికీల్లో పొందుపరచడం విశేషం. ప్రముఖ ఇంగ్లాండు చిత్రకారుడు సాలిస్‌ బరి స్టేయిన్‌గాజుముక్కలతో 3 దశల్లో ఈ కిటికీలకు రూపకల్పన చేశారు. ముందుగా 1927లో చర్చిలో ఎదురుగా ఉన్న వేదిక కిటికీ అద్దాల్లో క్రీస్తు ఆరోహణ దృశ్యాలు, 1947లో చర్చిలో కుడివైపున కిటికీ అద్దాల్లో ఏసు జనన దృశ్యాలు, 1958లో క్రీస్తు శిలువపై వేలాడుతున్న దృశ్యాలు పొందుపరిచారు. ఎండ రాగానే చర్చిలోపల నుంచి చూస్తే కిటికీ అద్దాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు అగుపించడం ప్రత్యేకత.
  • 173 అడుగుల శిఖరంతో రెండు అంతస్తులుగా ఉండే ఈ నిర్మాణంలో ఎక్కడాపిల్లర్లు, బీములు లేకుండా కేవలంరాళ్లు, దంగుసున్నాన్ని వాడి ఈ చర్చ్ నిర్మించారంటే ఇప్పటికీ నమ్మలేము.
  • చర్చిలోరీసౌండ్‌ రాకుండా రబ్బరు, పత్తితో బాటు పలు రసాయనాలు వాడి చర్చి కప్పును ఎకో ప్రూఫ్‌ చేయించడం విశేషం.
  • మందిరం వేదికపై బల్లలు, కుర్చీలు, గురువులు ఆసీనులయ్యే బల్లలు సైతం ఎంతో కళాత్మకంగా ఉంటాయి. ప్రధాన వేదికపై ఉండే ప్రభు భోజనపు బల్లను రంగూన్‌ టేకుతో మలచారు. బైబిల్‌ పఠన వేదికనుజెకొస్లొవేకియా వడ్రంగులు దేవదారు కలపతో పెద్ద పక్షి ఆకారంలో మలచిన తీరు అద్భుతం .
  • ఈ చర్చిలోని 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో ఉన్నపెద్ద ప్రార్థనా మందిరంలో ఒకేసారి 5,000 మంది ప్రార్ధన చేసుకోవచ్చు.

అంబరాన్ని అంటే క్రిస్మస్ వేడుకలు

ఆసియాఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన మెదక్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలు కన్నుల పండువగా జరుగుతాయి. దేశ విదేశాల నుంచి అసంఖ్యాకంగా క్రైస్తవ సోదరులు తరలివచ్చి రక్షకుడి ఆగమనం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్‌ సందర్భంగా ఈ చర్చ్ విద్యుత్‌కాంతులతో మరింత శోభాయమానంగా ఉంటుంది. ఒక్క క్రైస్తవులే కాదు మిగతా మతాలవారు క్రిస్మస్‌ పర్వదినాల్లో ఈ చర్చ్‌కు వచ్చి ప్రార్థనల్లో పాల్గొనడం పరమతసహనానికి ఓ నిదర్శనం. మీరూ ఈ క్రిస్మస్ సెలవుల్లో ఓసారి మెదక్ చర్చి ని చూసి ప్రభువు ఆశీర్వాదాన్ని పొందిరండి. 

ఎలావెళ్ళాలి? 

హైదరాబాద్  నుంచి 110 కిలోమీటర్ల దూరంలోని మెదక్ పట్టణంలో ఈ చర్చ్ఉంది. రోడ్డుమార్గంలో వెళ్లేవారు 44 వ నంబరు జాతీయ రహదారిపై రెండున్నర గంటలు ప్రయాణించి మెదక్ చేరుకోవచ్చు. బస్సులే గాకబోలెడన్ని ప్రయివేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE