తెలుగునాట దర్శనీయ ప్రదేశాల్లో యాగంటి ఒకటి. పలు ఆధ్యాత్మిక, చారిత్రక, ప్రాకృతిక విశేషాలకు నెలవైన ఈ క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీ దూరంలో ఉంది. ఎర్రమల పాదాన ఉన్న ఈ గ్రామంలో కొలువై ఉన్న యాగంటేశ్వరుని వల్ల ఈ ఊరికి యాగంటి అని పేరు. మరో గాథ ప్రకారం కాలజ్ఞాన కర్త వీర బ్రహ్మేంద్ర స్వామి ఇక్కడి గుహలో సిద్ధిపొంది 'ఏన్ కంటి' అన్నారనీ, అదే కాలక్రమంలో యాగంటి అయిందనీ చెబుతారు.  యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన బసవయ్య నానాటికీ పెరగటం విశేషం. ఇదే ఈ గ్రామానికి దేశవ్యాప్త గుర్తింపును తెచ్చిన విశేషం.

ఆలయ విశేషాలు

లింగాకారుడైన శివుడు ఈ ఆలయంలో విగ్రహరూపంలో దర్శనమిస్తారు. అగస్త్య మహాముని తపస్సుకు మెచ్చిన ఆదిదంపతులు ఒకేశిలలో ఉమామహేశ్వరులుగా ఇక్కడ వెలిశారనీ, ఇలాంటి క్షేత్రము భారతావనిలో మరెక్కడా లేదనీ చెబుతారు. ఆలయ ముఖమండప ఈశాన్య భాగాన బ్రహ్మాండమైన రాతి నంది కనిపిస్తుంది. నాలుగు స్తంభాల మంటపంలోని ఈ నందీశ్వరుడు స్వయంభువు. ఏటికేడు పెరుగుతూ ఉన్న ఈ బసవయ్య చుట్టూ 90 ఏళ్ళనాడు సౌకర్యంగా ప్రదక్షణలు చేసేవారట. కాని ప్రస్తుతం మంటప స్తంభాలను బయటకు నెట్టేంతగా ఇక్కడి నందీశ్వరుడు పెరిగిపోయాడు. ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం మేర బసవయ్య పెరుగుతున్నట్లు భారత పురావస్తుశాఖ వారు సైతం నిర్ధారించటం విశేషం. నందీశ్వరుని ఎదుగుదల వల్ల బయటికి వాలిన మంటప స్తంభాలకు మద్దతుగా పెట్టిన కొన్ని బండరాళ్లను చూడవచ్చు.

ఆలయ విశేషాలు

యాగంటి శివాలయ నిర్మాణం పల్లవులు, చోళులు, చాళుక్యుల కాలంలో మొదలై విజయనగర రాజుల చేత  పూర్తి చేయబడింది. ఆలయ వాయువ్యాన సహజంగా ఏర్పడిన అగస్త్య పుష్కరిణి ఉంటుంది. ఈ క్షేత్రానికి సుమారు 15 కి.మీ దూరాన ఉన్న 'ముచ్చట్ల' క్షేత్రమునుండి నీరు ఈ పుష్కరణిలో కలుస్తుంది. కొండల్లోంచి వచ్చే సహజసిద్దమైన, స్వచ్ఛమైన నీటితో పుష్కరిణి కళకళలాడుతూ ఉంటుంది. ఈ పుష్కరిణి విశేషాలన్నీ దానికి ఉత్తరానున్న పెద్దరాతిపై దేవనాగరలిపిలో చెక్కబడి వున్నాయి. ఈ పుష్కరిణి నీరే ఆలయపు ముందున్న పెద్దకోనేరు చేరి అటుపిమ్మట సమీప పంటపొలాలకూ చేరుతుంది. 

ఆకట్టుకొనే గుహలు

 యాగంటి గుడి చుట్టూ ఉండే ఎర్రమల కొండల్లో సుమారు 50 అడుగుల దూరంతో 3 పెద్ద గుహలుకనిపిస్తాయి. వీటిలో మొదటిది 'రోకళ్ళ గుహ'. గుహలోని నిటారు మెట్లెక్కి ముందుకు వెళితే అగస్త్యముని స్థాపిత శివలింగం దర్శనమిస్తుంది. రెండవ గుహను వేంకటేశ్వర గుహ అంటారు. గతంలో ప్రతిష్ట కోసం తెచ్చిన వేంకటేశ్వరుని విగ్రహంలోని లోపాలు కనిపించటంతో దాన్ని ఈ గుహలో భద్రపరిచారు. మూడవది శంకర గుహ. ఇక్కడ ఎందరో మునులు తపమాచరించినట్లు చెబుతారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఈ గుహలోనే కాలఙ్ఞాన రచన చేసినట్లు చెబుతారు. ఈ గుహ లోనే కాలఙ్ఞానపు పూర్తి ప్రతి ఉందని స్థానికుల నమ్మకం. బనగాన పల్లె నుండి యాగంటి మార్గంలో గల చిన్న కొండపై 400 ఏళ్ళనాడు బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన అందమైన భవంతి సైతం యాత్రికులను  విశేషంగా ఆకర్షిస్తుంది. ఇన్ని విశేషాలున్న యాగంటిని ఈ వారాంతంలోనే మీరూ తప్పక దర్శించండి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE