మన ప్రాచీన భారతం ఎన్నో మతాలకు పుట్టినిల్లు. వాటిలో మహావీరునిచే ఆరంభింపబడిన జైనమతం ఒకటి. ఇందులో శ్వేతాంబర, దిగంబర అనే శాఖలున్నాయి. సహజంగానే కఠినమైన నియమాల సమాహారమైన దిగంబర జైనం ఇతర ప్రాంతాల్లో పెద్దగా వ్యాప్తి చెందకపోయినా దక్షిణాదిన మధ్య కర్ణాటకలో బలమైన ప్రభావాన్ని చూపింది. నేటికీ అక్కడ కనిపించే కట్టడాలు నాటి జైన వైభవానికి చిరునామాలుగా ఉన్నాయి. ఇలాంటి చెదరని గుర్తుల్లో ‘శ్రావణ బెళగొళ’లోని భారీ బాహుబలి విగ్రహంతో బాటు మరెన్నో. ఇప్పుడు శ్రావణబెళగొళ విశేషాలు తెలుసుకుందాం. 

స్థల విశేషాలు

 'బెళ్ళి'(తెల్లని), గొళ ( నీటిగుండం) అనే కానంద పాదాల సమాహారమే శ్రావణబెళగొళ. దీన్ని స్థానికులు ‘బెళగొళ’ అంటారు. చంద్రగిరి, ఇంద్రగిరి అనే 2 కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన సరోవరమే ఈ బెళగొళ. ఇక.. జైనంలో సర్వం త్యజించి సన్యాసం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. నాడు ఎందరో శ్రమణులు ఈ కొండల్లో ఏళ్లతరబడి ధ్యానం చేసి ముక్తిని సాధించారు. శ్రమణులున్న కారణంగా ‘శ్రమణ బెళగొళ’ గా ఉన్న ఈ ప్రదేశం పేరు ఆ తర్వాతి రోజుల్లో ‘శ్రావణ బెళగొళ’గా మారింది. 

అందరి కళ్ళూ బాహుబలి మీదే  

  శ్రావణ బెళగొళలో ప్రత్యేక ఆకర్షణ.. భారీ గోమఠేశ్వరుని విగ్రహం. బలమైన బాహువులున్న కారణంగా ఈయనను బాహుబలి అనేవారట. ఈయన ఋషభుడనే రాజు కుమారుల్లో ఒకడు. తండ్రి తదనంతరం రాజ్యాన్ని కొడుకులకు సమంగా పంచి ఇవ్వగా, సహించలేని పెద్దభార్య కుమారుడైన భరతుడు అంతా తనకే కావాలనే కోరికతో సోదరులమీద దండెత్తి వారి రాజ్యాలను ఆక్రమించుకొంటాడు. అతడి ఆగడాన్ని తట్టుకోలేని సోదరులంతా రాజ్యాన్ని అప్పగించి తపోవనాలకు వెళ్లిపోగా... స్వతహాగా శాంతికాముకుడైనప్పటికీ బాహుబలి మాత్రం అన్న దుర్మార్గాన్ని ప్రశ్నించి అతనితో తలపడతాడు. అయితే యుద్దం పేరిట ప్రాణనష్టం వద్దనుకుని వారిద్దరూ ద్వంద్వ యుద్దం చేసే క్రమంలో బాహుబలి సోదరుడిని పైకెత్తి నేలకేసి కొట్టబోయి, ఆగి భరతుని క్షమించి వదిలిపెట్టటమే గాక మొత్తం రాజ్యాన్ని అతనికే అప్పగించి ఇంద్రగిరిపై గొప్ప తపస్సు చేసి నిలబడిన భంగిమలోనే మోక్షం పొందుతాడు. ఆ ప్రదేశంలోనే నేటి ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్ర చెబుతోంది.

బాహుబలి విశేషాలు

ఇక్కడి బాహుబలి విగ్రహం ఎత్తు 58 అడుగులు. ఇది ప్రతిష్టించిన విగ్రహం కాదు. క్రీ.శ 983లో చాముండరాయలు అనే మంత్రి ఆదేశం మేరకు అర్త్సమేణి అనే శిల్పి నేతృత్వంలోని బృందం ఓ కొండ భాగాన్ని ఇలా మలచినట్లు చరిత్ర చెబుతోంది . చిన్న కొండపై ఉండే నిలువు మెట్లు ఎక్కినా యాత్రికులకు నిర్మలమైన రూపంలో బాహుబలి దర్శనమిస్తాడు. కళ్ళుమూసుకొని ప్రశాంతంగా నిలబడి ధ్యానం చేస్తున్న భంగిమలోని ఆ మూర్తి రూపాన్ని మాటల్లో వర్ణించలేము. సంసారం పట్ల యోగిలో కనిపించే నిర్వేదం, దివ్యమైన తేజస్సు ఈ బాహుబలి ముఖంలో స్పష్టంగా కనిపిస్తాయి. విగ్రహం కాళ్ల నుంచి భుజాల వరకు నిజమైన పూలతీగెలు అల్లుకుపోయాయా.. అన్నట్టు చెక్కిన రాతి లతల సొగసు అనన్య సామాన్యం. సహజ రీతిలో కనిపించే పాదాల మడతలు, విగ్రహపు కాలిగోళ్ళపై గల గీతలు చూపరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఆయన పాదాల ముందు నిలబడి తల వీలున్న మేర వెనక్కు వాల్చి చూస్తే ...ఆకాశమంతా విస్తరించాడా అన్నట్లు కనిపించే ఆ మూర్తి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

ఈ విగ్రహానికి పుష్కరానికోసారి (12 ఏళ్ళకోసారి) కనులపండువగా జరిగే మహామస్తకాభిషేకాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది మంది ఇక్కడకు చేరుకొంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 1008 భారీ పాత్రల్లో నింపిన పాలు, టన్నుల కొద్దీ తేనె, పెరుగు,అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చెరకురసం, చక్కెర, బాదంపప్పు, కుంకుమ పువ్వు, పసుపు, వెండి బంగారు నాణాలు, పలు ఫల రసాలతో విగ్రహం మొత్తం తడిసేలా అభిషేకం చేస్తారు. విగ్రహం చుట్టూ ప్రత్యేకంగా నిర్మించిన కలప నిర్మాణం పై నుంచి జైన గురువులు చేసే ఈ అభిషేకాన్ని భక్తులు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని దర్శిస్తారు.

చారిత్రక విశేషాలు

బాహుబలి దర్శనం తర్వాత యాత్రికులు జైన తీర్థంకరుల దేవాలయాలను దర్శించుకొంటారు. ఆ తర్వాత ఈ చంద్రగిరిపై అశోకుడు నిర్మించిన చంద్రగుప్త బస్తీని దర్శిస్తారు. ఇక్కడ విలువైన జాతిరాళ్లతో పొదిగిన 8 విగ్రహాలు యాత్రికులను అమితంగా ఆకట్టుకొంటాయి. ఈ కొండ పైన, కింద, చుట్టుపక్కల గ్రామాల్లో లభించిన క్రీ. శ 6 నుంచి 18 శతాబ్దపు కాలపునాటి ఎన్నో శాసనాలు, దేవాలయాలు కూడా పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.

 రవాణా సౌకర్యం 

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉంటుంది. ఇది బెంగుళూరు-మంగుళూరు జాతీయ రహదారి మార్గంలో ఉంది. శ్రావణ బెళగొళకు 11 కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయపట్టణం నుంచి పలు పట్టణాలకు రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. కనుక యాత్రికులు ఇక్కడకు చేరుకుంటే శ్రావణ బెళగొళ చేరినట్టే. రైల్వే ప్రయాణీకులు హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గంలో, విమాన ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడి జైనమఠం వారిని సంప్రదించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE