• HOME
 • వాస్తు
 • అభివృద్ధికి దోహదం చేసే ఆఫీసు వాస్తు

వాస్తు కేవలం నివాస గృహాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. కార్యాలయాలు, హోటళ్లు మొదలు ప్రతి నిర్మాణానికీ వాస్తు నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా మనిషి ఆర్థికాభివృద్ధికి, వృత్తిపరమైన ఎదుగుదలకు కేంద్ర స్థానమైన కార్యాలయం విషయంలో వాస్తు నియమాలను పాటించటం వల్ల సానుకూల ఫలితాలు పొందవచ్చు. కార్యాలయపు వాస్తు నియమాలు, ఈ మార్పుల ఫలితంగా వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం.

 • వ్యాపార యజమాని (చైర్మన్ లేదా ఎండి), ప్రధాన కార్య నిర్వహణ అధికారి (సి.ఇ. ఓ) ఎప్పుడూ కార్యాలయపు నైరుతి మూల గదిలో తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఆ గది ఈశాన్య మూలన తలుపు ఏర్పాటు చేసుకొని దాని ద్వారానే రాకపోకలు సాగించాలి. దీని వలన పనులు సాఫీగా సాగుతాయి. సిబ్బంది పై అధికారి మాటను తు.చ తప్పక పాటిస్తారు. యజమానికి విజయం, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. యాజమాన్యానికి, సిబ్బందికీ తరచూ గొడవలు జరిగే కార్యాలయాల్లో ఈ మార్పు సానుకూల ఫలితాన్నిస్తుంది. ఈ గదిలో ఉండే మేనేజింగ్ డైరక్టర్ గదిలో ఉండే టేబుల్ తప్పక దీర్ఘ చతురస్రాకారంగా వుండి తీరాలి.
 • ఆస్తుల కొనుగోలు పత్రాలు, కాంట్రాక్ట్ డీల్స్, విలువైన బ్యాంక్ ఫైల్స్, అవగాహన ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు సిద్ధం చేసుకునేటప్పుడు యజమాని లేదా ప్రధాన కార్యనిర్వహణాధికారి నైరుతి గదిలో తూర్పు ముఖంగా కూర్చోవాలి. దీనివల్ల సంస్థ విజయ పథాన సాగుతుంది. విలువైన దస్తావేజులు, ఒప్పంద పత్రాలు నైరుతి దిశలో ఉండే బీరువాల్లో పెట్టండి.
 • కార్యాలయంలోని ఇతర సీనియర్ ఉద్యోగులు దక్షిణం లేక పడమర దిక్కున గానీ, అలా వీలుకాని పక్షంలో నైరుతి మూల గదుల్లో కూర్చోవాలి. అసిస్టెంట్ మేనేజర్లకి ఉత్తరం లేదా తూర్పు దిక్కున కూర్చునే స్థలం కేటాయించాలి. మార్కెటింగ్, ప్రకటనలు వంటి క్షేత్ర స్థాయి సిబ్బందికి తప్పక వాయవ్య మూలన మాత్రమే తమ సీట్లను కేటాయించాలి.
 • కార్యాలయంలోని ఆదాయ, వ్యయాల వ్యవహారాలకు సంబంధించిన అక్కౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారికి ఆగ్నేయ దిశలో గదిని కేటాయించాలి. కార్యాలయానికి వచ్చే వారిని ముందుగా పలకరించి వారి వ్యవహారాల్లో సాయపడే రిసెప్షన్ విభాగం ఈశాన్య మూలన, స్టాక్, స్టోర్ రూమ్ లు ఆగ్నేయ లేదా వాయవ్య మూలన ఉండాలి.
 • కార్యాలయ ఫ్లోరింగ్ ఉత్తరం లేదా తూర్పు దిక్కులు లేక ఈశాన్య మూల వైపు కాస్తంత వాలుగా వుండాలి. దీనివల్ల ఆర్ధికంగా మంచి లాభాలు సిద్ధిస్తాయి. అయితే ఈ వాలు కార్యాలయ ప్రధాన ద్వారంవైపు ఉంటే మాత్రం ఈ మార్పు నష్టానికి దారితీస్తుంది.
 • కార్యాలయం పై కప్పు ఎగుడుదిగుడుగా గాక అన్ని దిక్కుల్లో సరిసమాన ఎత్తులో ఉండాలి. ఒకవేళ కప్పు తూర్పు లేదా ఉత్తరం వైపు ఎత్తుగా ఉంటే ఆ కార్యాలయం ఎప్పుడూ అప్పులతో సతమతం అవుతుంది. డబ్బు వచ్చినా నిలవదు. 
 • నష్టాల్లో ఉన్న కార్యాలయాల్లో వెడల్పాటి పాత్రల్లో రోజూ తాజా నీరు నింపి అందులో తాజా పుష్పాలను వేసి ఉంచితే ఇబ్బందులు తొలగి సత్ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఈ నీరు, పువ్వులను రోజూ మార్చాల్సిందే.
 • కార్యాలయ భవనం పైన ఉండే నీళ్ల టాంక్‌కు లీకేజీలు ఉండకూడదు. లేనిపక్షంలో ఆ సంస్థ వృద్ధి కుంటుబడటమే గాక లాభాలు పక్కదోవపట్టటం, అవినీతి పెరగటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇబ్బందిని నివారించాలంటే భవనం నిర్మించుకునేటప్పుడే పై కప్పుకు రెండు మూడు అడుగుల ఎత్తులో  దిమ్మె కట్టుకుని ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించుకోవాలి.
 • కార్యాలయపు వాణిజ్య వాహనాలు, క్రేన్లు, ట్రక్కులు, ట్రాలీల వంటి బరువైన పనిముట్లు, ఉద్యోగుల బైకులు, కార్లు పెట్టుకొనే పార్కింగ్ ప్రదేశం ఎప్పుడూ కార్యాలయానికి నైరుతి భాగంలోనే ఉండితీరాలి.
 • కార్యాలయంలో ఈశాన్య భాగంలో బరువు పనికిరాదు. ఆఫీసుల్లో తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఎంత ఎక్కువ ఖాళీ ఉంటే అంత మంచిది.
 • కార్యాలయాల్లోని టాయిలెట్స్ ఎప్పుడూ పడమర దిక్కు లేదా వాయవ్య మూలన ఉండాలి. టాయిలెట్స్ సరి సంఖ్యలో ఉండాలి.
 • కార్యాలయపు మెట్లు దక్షిణం లేదా పడమర వైపు ఉండాలి. ఆఫీసు పై కప్పు కంటే మెట్లు కలిసే చోటు ఎత్తుగా ఉండకూడదు.
 • కార్యాలయంలో వంటగది లేదా క్యాంటిన్ ఎప్పుడూ ఆగ్నేయంలోనే ఉండాలి.
 • ఆఫీసులో ఏ ఉద్యోగీ పై కప్పు బీమ్‌ల కింద కూర్చోకుండా చూడాలి.
 • కార్యాలయ భవనపు ఏ తలుపైనా తూర్పు వైపు తెరుచుకునేలా ఉండాలి.
 • కార్యాలయపు సింహ ద్వారానికి ఎరుపు వస్త్రంలో చుట్టిన బూడిద గుమ్మడి కాయ వేలాడదీస్తే నర దృష్టి సోకకుండా చూసుకోవచ్చు. అయితే ఈ కాయను నెలకోసారి మార్చుతూ ఉండాలి.
 • వారానికి కనీసం ఒక్క సారైనా కార్యాలయంలో సాంబ్రాణి ధూపం వేయించాలి. దీనివల్ల ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE