అదృష్టానికి  ప్రతీకగా భావించే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని చూస్తే ఎవరికైనా ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. శాంతి, సంపద, సంతోషాలకు ఇది ప్రతీక అని  ఫెంగ్ షుయ్ వాస్తు చెబుతుంది.  బౌద్ధులు నవ్వుతున్న బుద్ధుని మూర్తిని ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. హ్యాపీబుద్ధా, బుదాయి, కైసీ, మైత్రేయ, హొటై అనే పేర్లతో ప్రాచుర్యంలో ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ళు, కార్యాలయాలు,  వాహనాల్లో పెట్టుకోవటం కనిపిస్తుంది.  ఇంత ప్రాచుర్యం పొందిన లాఫింగ్ బుద్ధ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు...

జానపద సాహిత్యంలో.. 

 ఒక థాయ్ పురాణ గాథ ప్రకారం పూర్వం థాయిలాండ్‌ లో 'సంకాజాయ్‌' అనే ఎంతో అందగాడైన సాధువు ఉండేవారట. ఆయన అందానికి స్త్రీ, పురుషులంతా ఆకర్షితులు కావటంతో ఆయన తన రూపాన్ని లాఫింగ్ బుద్ధా మాదిరిగా మార్చుకున్నాడట. ఈ మహత్తును గమనించిన జనం ఆయనను దైవంశ గలవాడిగా భావించి ప్రార్థించేవారు. తర్వాతి కాలంలో ఆలయాలు నిర్మించి ఆరాధించారు. ఇప్పటికీ ఈ సంప్రదాయం అక్కడ కొనసాగుతోంది. ఆయన ఉదరంలో బోలెడు సంపదలున్నాయనీ, రోజూ ఒకసారి ఆయన పొట్టను నిమిరి నమస్కరిస్తే సంపదలు సిద్ధిస్తాయని థాయ్ వాసులు నమ్ముతారు. అదే.. చైనాలో బుద్ధుడు సంచరించిన కాలంలో ఆయన్ను 'హుతీ' పేరిట పిలిచేవారు. చెదరని చిరునవ్వు, పెద్ద పొట్ట, చేతిలో భిక్షాపాత్రతో తిరుగుతూ తన చుట్టూ చేరిన బీద పిల్లలకు సంచీలోని తినుబండారాలు పంచేవాడట.రోజంతా ఎన్ని తినుబండారాలు పంచినా ఆ సంచీ ఖాళీ అయ్యేది కాదట. ఆయన్ను చూసినవారికి ఆ రోజు సుఖంగా గడిచేదట. ఈ కారణంగా నేటికీ లాఫింగ్ బుద్ధా అదృష్టానికి ప్రతీకని చైనీయులు నమ్ముతారు. జపనీయులు ఆరాధించే ఏడుగురు అదృష్ట దేవతల్లో లాఫింగ్‌ బుద్ధా ఒకరుగా కనిపిస్తారు.

బహురూపి బుద్ధుడు

శ్రద్ధగా గమనిస్తే లాఫింగ్‌ బుద్ధా భంగిమల్లో అనేక మార్పులు ఉంటాయి. ఒక్కో భంగిమకు ఒక్కో అర్థం ఉంటుందనీ, దాన్ని బట్టే ఆయనిచ్చే ఫలితమూ మారుతుందని ఫెంగ్ షుయి నిపుణులు చెబుతారు.  కూర్చొని చేతులు పైకెత్తి బంగారు బంతులు మోస్తూ కనిపించే ప్రతిమ ఆయురారోగ్యాలు ఇస్తుందనీ, నిలబడి నవ్వుతూ ఉండే రూపు సుఖసంపదను వర్షిస్తుందని చెబుతారు. పిల్లలతో ఆడుకునే భంగిమలో ఉండే ప్రతిమ ఉన్న ఇంట కాపురముండే వారి మనసు చిన్నారుల మాదిరి కల్మషరహితంగా ఉంటుందనీ, చేత గిన్నెతో ఉన్న ప్రతిమ జ్ఞానాన్ని, దానగుణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతారు. చేతిలో విసనకర్ర లేదా కర్రతో ఉన్న ప్రతిమ ప్రయాణ సమయంలో వచ్చే ఆపదల నుంచి కాపాడుతుందనీ, బంగారు నాణాల రాశి మీద కూర్చుని ఉన్న విగ్రహం ఇంట్లో ఉంటే ఆ ఇంట సిరిసంపదలు వర్షిస్తాయని అర్థం. బంగారు రంగు ప్రతిమ ప్రతికూల శక్తులను హరిస్తుందనీ, మెడలో ముత్యాల మాల, చేతిలో బంతిని కలిగి ఉన్న విగ్రహం ధ్యానం, సంపద,  ఆరోగ్యానికి ప్రతీకనీ, స్పటిక విగ్రహం జ్ఞానదాయకమని చెబుతారు.

ప్రదేశాన్ని బట్టి ఫలితం

ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఈ మూర్తిని ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదు. ఈ మూర్తి ఎక్కడ పెట్టినా కాస్త ఎత్తులో, స్పష్టంగా కనిపించేలా ఉండాలి. నేల మీద, టీవీల మీద, స్నానాల గదిలో గానీ దీన్ని పెట్టరాదు.

  • నిలబడి ఉన్న ప్రతిమను తూర్పుదిశకు అభిముఖంగా ఉంచాలి. కుటుంబ సమస్యలున్నవారు దీన్ని ఇంట్లో అందరికీ కనిపించేలా పెట్టాలి. లివింగ్‌ రూమ్‌ లేదా హాల్‌లో పశ్చిమాభిముఖంగా కూడా పెట్టుకోవచ్చు.
  • బంగారు నాణాలపై కూర్చొని ఉండే ప్రతిమ వాయువ్య మూలనగానీ ఉత్తర, దక్షిణాభిముఖంగానీ ఉండాలి. ఒకవేళ వాయువ్యాన బాత్ రూమ్ ఉంటే ఆగ్నేయంలో పెట్టుకున్నా పర్వాలేదు.
  • పిల్లలతో ఆడుకుంటున్న మూర్తిని హాల్‌లో కానీ, చిన్న పిల్లల బెడ్‌రూమ్‌లో కానీ దక్షిణ దిశలో ఉంచడం మంచిది.
  • ముత్యాలు, రత్నాలతో కూడిన విగ్రహాన్ని స్టడీ రూమ్‌లో పెడితే దాని నుంచి వచ్చే సానుకూల తరంగాల వల్ల పిల్లలు చదువులో రాణిస్తారు. అదే.. హాల్ ఈశాన్య మూలన పెడితే యజమాని ఆదాయం పెరుగుతుంది.
  • ఉద్యోగులు నిలబడి నవ్వుతూ ఉన్న విగ్రహాన్ని ఆఫీసు డెస్క్ మీద పెట్టుకుంటే మానసిక ఒత్తిడి తొలగటంతో బాటు సహోద్యోగులతో బంధం బలపడుతుంది. సింహద్వారానికి ఎదురుగా సూర్యకిరణాలు పడే చోట పెడితే అన్నివిధాలా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
  • ప్రేమికుల మనసు దోచుకోవాలనుకునే వారు పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడి బొమ్మ బహుమతిగా ఇస్తే వారి ప్రేమ వివాహబంధంగా మారి కలకాలం బాగుంటుందని ఫెంగ్ షుయ్‌ నిపుణులు సూచిస్తున్నారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE